తల్లి కాంగ్రెస్ నోట పిల్ల కాంగ్రెస్ మాట

Update: 2016-04-15 04:18 GMT
ఎదుటోడికి వచ్చే ఇబ్బంది తర్వాత రోజుల్లో తనకూ ఎదురవుతుందన్న లాజిక్ మిస్ కావటంతో వచ్చే నష్టం ఎంతలా ఉంటుందన్న విషయం తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడు బాగానే అర్థమవుతోంది. విభజించు పాలించు రీతిలో వ్యూహాత్మకంగా ఒక పార్టీ తర్వాత మరో పార్టీ మీద ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధాటికి కాంగ్రెస్ కుదేల్ అవుతోంది. విపక్షం అన్నది లేకుండా చేయటం.. బలమైన నేతలంతా తమ పార్టీలోనే ఉండాలంటూ ఆపరేషన్ ఆకర్ష్ పితామహుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనను నూటికి నూరు శాతం అమలు చేయటంలో కేసీఆర్ సక్సెస్ అవుతున్నారు.

మొన్నటివరకూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీద గురి పెట్టిన కేసీఆర్.. తాజాగా కాంగ్రెస్ మీద ఫోకస్ చేయటంతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకరి తర్వాత ఒకరన్నట్లుగా తెలంగాణ అధికారపక్షం దిశగా క్యూ కట్టటం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. మిగిలిన పార్టీలపై ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించిన వేళ.. మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరించిన కాంగ్రెస్ ఇప్పుడు కిందామీదా పడుతోంది. తాజా జంపింగ్స్ తో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కారులో షికారుకు క్యూ కడుతున్న వేళ.. కడుపు మండిపోయిన సీనియర్ కాంగ్రెస్ నేతలు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.

ఆసక్తికర విషయం ఏమిటంటే.. తెలంగాణ అధికారపక్షంపై విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు.. ‘పిల్ల కాంగ్రెస్’  అధినేత వైఎస్ జగన్  మాట్లాడినవే ఉండటం గమనార్హం. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవటాన్ని.. ఆయన సోదరి కమ్ మాజీ మంత్రి డీకే అరుణ తీవ్రంగా తప్పు పట్టారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానీ చిత్తశుద్ధి ఉంటే.. తమ పార్టీలో చేర్చుకునే వారిని తమ పదవుల నుంచి రాజీనామా చేయించి పార్టీలోకి చేర్చుకోవాలని హితవు పలికారు. చిట్టెం టీఆర్ ఎస్ లో చేరటం తన తండ్రి నర్సిరెడ్డి ఆత్మ క్షోభిస్తుందని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ మాటలన్నీ ఇంచుమించు పిల్ల కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ను పోలి ఉండటం గమనార్హం.
Tags:    

Similar News