అమ్మాకొడుకులు కోర్టుకొస్తే అంత హడావుడా?

Update: 2015-12-19 19:16 GMT
అనగనగా ఒక మీడియా సంస్థ. అప్పుడెప్పుడో 1950లలో పెట్టింది. పలు భాషల్లో ప్రచురించే ఆ దినపత్రిక కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. కాలక్రమంలో నష్టాలు రావటం.. ఆ సంస్థకు కాంగ్రెస్ పార్టీ రూ.90కోట్లు ఇచ్చి దాని ఊపిరి పోసేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ బండి నడవలేదు. చివరకు పార్టీకి చెల్లించాల్సిన బాకీ తీర్చకుండానే సదరు మీడియా సంస్థ మూసుకుపోయింది. మరి.. దేశాన్ని ఏలే కాంగ్రెస్ పార్టీకి రూ.90కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా. అందుకే.. కాంగ్రెస్ పార్టీలో తల పండిన నేతలంతా ఒకచోట కూర్చోని రూ.90కోట్లు రావాల్సిన బాకీని కేవలం కోటి రూపాయిల కంటే తక్కువ మొత్తానికి ఒక సంస్థకు అప్పజెప్పేశారు.

అయితే.. ఈ సంస్థ ఎవరిది? అని ఆరా తీస్తే దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం వస్తుంది. ఆ సంస్థ ఎవరిదో కాదు.. కాంగ్రెస్ పార్టీకి కళ్లు .. చెవులు లాంటి సోనియమ్మ.. రాహుల్ తో పాటు.. వారికి అత్యంత సన్నిహిత నేతలే. వారంతా కలిసి ఒక కంపెనీని పెట్టి.. సదరు మీడియా సంస్థ గొంతు నులిమేశారు. మరింత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. నేషనల్ హెరాల్డ్ సంస్థకు ఏకంగా రూ.1500కోట్ల మేరకు ఆస్తులు ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. ఆ ఆస్తుల్ని అమ్మేసి నేషనల్ హెరాల్డ్ అప్పుల్ని తీర్చేయొచ్చుగా. కానీ.. అలాంటిదేమీ లేకుండా జేబు సంస్థలతో కేవలం కోటి కంటే తక్కువ మొత్తంతో.. హెరాల్డ్ ను తమ సొంతం చేసుకున్నారు.

ఇలాంటి లెక్కల్ని ఈజీగా గుర్తించే బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి.. నేషనల్ హెరాల్డ్ తీగ లాగాడు. అంతే.. డొంక మొత్తం కదిలింది. చివరకు అన్నింటికి అతీతురాలైన సోనియాగాంధీ.. భవిష్యత్తు ప్రధానిగా కీర్తించే రాహుల్ గాంధీ కూడా కోర్టుకు హాజరు కావాల్సిన దుస్థితి ఏర్పడింది.  ఇక.. కోర్టుకు వచ్చిన సందర్భంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు ఆగమాగం చేశారు. మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా.. అమ్మను విపరీతంగా పొగిడేయటం..ఆందోళనలు.. నిరసనలు చేప్టటం లాంటివి చేశారు.

ఇక.. బెయిల్ వచ్చినట్లుగా కోర్టు నుంచి సమాచారం అందిన వెంటనే.. కోర్టు బయట.. వీధుల్లో నిలబడి ఎంతో ఆతృతగా చూస్తున్నకాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా అదేదో వరల్డ్ కప్ సాధించినంత గొప్పగా.. శుభాకాంక్షలు చెప్పుకోవటం చూసినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఇక.. అమ్మా.. కొడుకులు కోర్టు గుమ్మం తొక్కే సమయంలో ఢిల్లీ వీధులు మొదలుకొని.. దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోని ముఖ్యనగరాల్లో ఆందోళనలు నిర్వహించటం.. ఈ మొత్తానికి మోడీకి ప్రమేయం ఉన్నట్లుగా విమర్శలు చేయటం కనిపిస్తుంది. ఇక.. కేసును విచారిస్తున్న పాటియాలా హౌస్ దగ్గర కాంగ్రెస్ నేతలు హడావుడి భారీగా ఉంది.

ఎందుకిలా అంటే.. మోడీని బద్నాం చేయటం.. అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అయిన తమ అధినేత్రి సోనియా.. తమ యువరాజు రాహుల్ బాబులకు అసలేమీ తేలీదని.. కేవలం కపటంతో.. అధికార మదంతో మోడీ అండ్ కో కుట్రతో కేసు పెట్టారంటూ వాపోయారు. కోర్టు వద్దకు భారీగా జమ అయిన ప్రజల్ని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ పని అయిపోలేదని.. పార్టీ అధినేత్రి ఏమైనా అయితే.. వీధుల్లోకి రావటానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారన్న సందేశాన్ని చెప్పకనే చెప్పినట్లైంది. ఇలాంటి వ్యూహంతోనే కోర్టు దగ్గర కాంగ్రెస్ తన పార్టీ శ్రేణుల్ని భారీగా మొహరించిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News