కాంగ్రెస్‌ కు జైట్లీ క్వ‌శ్చ‌న్‌!...ఏపీకి హోదా ఎలా ఇస్తారు?

Update: 2019-04-02 15:09 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి తొలి విడ‌త పోలింగ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. ఇప్ప‌టికే నామినేష‌న్ల ఘ‌ట్టం ముగియ‌గా... పోలింగ్ కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇలాంటి కీల‌క త‌రుణంలో దాదాపుగా అన్ని పార్టీలు కూడా త‌మదైన వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఈ క్ర‌మంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసేసింది. పార్టీ అగ్ర‌నేత‌లంతా పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ అధ్య‌క్షుడి హోదాలో రాహుల్ గాంధీ... మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌డంతో పాటు అందులోని కీల‌క అంశాల‌పై మాట్లాడారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు ఉగ్ర‌వాద నిర్మూల‌న‌ - పేద‌రిక నిర్మూల‌న త‌దిత‌ర కీల‌క అంశాలూ ఉన్న ఈ మేనిఫెస్టోపై కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ త‌న‌దైన శైలిలో ఒంటికాలిపై లేచింది. కాంగ్రెస్ మేనిఫెస్టోను స‌మ‌గ్రంగానే ప‌రిశీలించిన మీద‌ట‌.... బీజేపీ త‌ర‌ఫున కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వ‌చ్చి త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే... దేశాన్ని విభజించే దిశ‌గా ఆ పార్టీ క‌దులుతున్న‌ట్లుగా అనిపిస్తోంద‌ని జైట్లీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషించే దిశ‌గా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంద‌న్న జైట్లీ... కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే దేశంలో ఉగ్ర‌వాదంపై పోరు సాగించ‌డం కూడా దుర్ల‌భంగానే మారుతుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశాభివృద్ధికి అవ‌స‌ర‌మైన విష‌యాల‌ను వ‌దిలేసిన కాంగ్రెస్ పార్టీ దేశంలో అల్ల‌క‌ల్లోలం సృష్టించే అంశాల‌ను ప్ర‌స్తావించింద‌ని కూడా జైట్లీ త‌న‌దైన మార్కు పంచ్‌లు విసిరారు. దేశాన్ని ముక్క‌లు చేసే దిశ‌గా కాంగ్రెస్ మేనిఫెస్టో సాగింద‌ని కూడా జైట్లీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో క‌మిటీని తుక్డే తుక్డే గ్యాంగ్‌గా అభివ‌ర్ణించిన జైట్లీ... ఆ క‌మిటీ రూపొందించిన మేనిఫెస్టోకు ఆమోద ముద్ర వేసిన రాహుల్ గాంధీ సొంత నిర్ణ‌యాలు తీసుకునే స‌త్తా లేని నేత‌గా పేర్కొన్నారు.

ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని కూడా ప్ర‌స్తావించిన జైట్లీ... అస‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎలా ఇస్తార‌ని కూడా కీల‌క ప్ర‌శ్న‌ను సంధించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌న్న త‌మ ప్ర‌తిపాద‌న‌కు ఆ రాష్ట్ర సీఎం హోదాలో చంద్ర‌బాబు స‌మ్మ‌తి తెల‌ప‌డ‌మే కాకుండా... ఏకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన విష‌యాన్ని జైట్లీ ప్ర‌శ్నించారు. ఏపీ అసెంబ్లీ త‌మకు ప్ర‌త్యేక ప్యాకేజీ మంచిద‌ని తీర్మానం చేసిన త‌ర్వాత ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం ఎలా సాధ్య‌ప‌డుతుందని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. అస‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటే ఎన్ని అడ్డంకులు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి తెలుసా? అని కూడా జైట్లీ ప్ర‌శ్నించారు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తానని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు నిధులు ఎక్కనుండి తెస్తుందని ఆయన ప్రశ్నించారు. తమ రాష్ట్రాలకు సైతం ప్రత్యేక హోదా కావాలని ఒడిశా తో సహ అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న విషయాన్ని కూడా జైట్లీ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోపై త‌న‌దైన వ్యాఖ్య‌లు చేసిన జైట్లీ ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని మ‌రింత‌గా హైలెట్ చేసి... హోదా ఎలా సాధ్య‌మంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం నిజంగానే సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News