బ్రోక‌ర్లు..జోక‌ర్లు చేరితే చూస్తూ ఊరుకోవాలా?

Update: 2018-06-22 05:19 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అత్య‌వ‌స‌ర‌ కార్యవర్గ సమావేశం వాడివేడిగా సాగింది. పార్టీ బలోపేతం - శ‌క్తియాప్‌ - రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన అంశాలపై పార్టీ అనుసరించే తీరుపైన చర్చించేందుకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన టీ పీసీసీ కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జీ రాంచంద్ర కుంతియా - సీఎల్పీ నేత జానారెడ్డి - టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క - మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ లీ - ఏఐసీసీ కార్యదర్శి హనుమంతరావుతో పాటు డీసీసీ అధ్యక్షులు - టీ పీసీసీ నేతలు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపైన మాజీ మంత్రి డీకే అరుణ ఫైర్‌ అయినట్లుగా తెలిసింది.

త‌న జిల్లాలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై అరుణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. పాలమూరు జిల్లాలో పార్టీని కొంత మంది నేతలు తమ సొంత ఎజెండాతో నాశనం చేస్తున్నారని డీకే ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ఈ సందర్భంగా డీకే అరుణ తీవ్రంగానే స్పందించినట్లు సమాచారం. ‘ పాలమూరు జిల్లాలో పార్టీని కష్టకాలంలో కష్టపడి నిర్మించుకున్నాం. కొంత మంది నేతలు ( కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డినుద్దేశించి ) ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారు. జిల్లా నేతలకు తెలియకుండానే ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంటున్నారు. జోక‌ర్లు - బ్రోక‌ర్లను పార్టీలోకి తీసుకురావ‌డం వ‌ల్ల పార్టీకి శ్ర‌మ‌ను - స‌మ‌యాన్ని దార‌పోసిన వారి సంగ‌తి ఏంటని ఆమె ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం.

కాగా, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జీ రాంచంద్ర కుంతియా ఈ ప‌రిణామంపై స్పందించారు. రాహుల్‌ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికే కొంత మంది ఢిల్లికి వెళ్లారని - ఉత్తమ్‌ పై ఫిర్యాదు చేయడానికి కాదని మీడియా అడిగిన ప్రశ్నకు కుంతియా బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే వారికే పార్టీ టికెట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో నేతల మధ్య ఉన్న విభేదాలపై నాయకులను పిలిచి మాట్లాడుతామన్నారు. టికెట్లు ఇచ్చే విషయంలో వివిధ సంస్థలతో సర్వేలు నిర్వహించడంతో పాటు స్థానికి నేతల సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. పార్టీకి వ్యతిరేక చర్యలకు పాల్పడేవారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డినే కొనసాగుతారని, ఆయన సారధ్యంలోనే 2019 ఎన్నికల్లోకి వెళ్లుతామని కుంతియా స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Tags:    

Similar News