నిన్న బ్యాట్ తో కొడితే.. నేడు నెత్తిన బుర‌ద పోసేశారు

Update: 2019-07-05 05:46 GMT
ఎమ్మెల్యేల ఆగ‌డాలు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. మొన్న‌టికి మొన్న బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు అధికారిని న‌డి రోడ్డు మీద క్రికెట్ బ్యాట్ తో కొట్టిన వైనం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఈ ఉదంతంపై ప్ర‌ధాని మోడీ సైతం స్పందించి.. ఇలా చేసిన వారిని ఊరుకోమ‌ని.. వారు ఎవ‌రైనా.. ఎవ‌రి కొడుకులైనా వ‌దిలేది లేద‌ని.. చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఇలాంటివి మ‌రోసారి చోటు చేసుకుంటే స‌ద‌రు ఎమ్మెల్యేను వ‌దులుకోవ‌టానికి సైతం తాను సిద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ దారుణాన్ని మ‌ర‌వ‌క‌ముందే మ‌రో రాష్ట్రంలో మ‌రో అధికారిపై ఎమ్మెల్యే ఒక‌రు దాడి చేసిన తీరు షాకింగ్ గా మారింది. సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. అధికారుల‌పై ప్ర‌జాప్ర‌తినిధుల దాడి తీరును ప్ర‌తి ఒక్క‌రు ఖండిస్తున్నారు. క్రికెట్ బ్యాట్ ఉదంతం మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంటే.. తాజాగా బుర‌ద దాడి మ‌హారాష్ట్రలో చోటు చేసుకుంది.

రాష్ట్రంలోని జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ డిప్యూటీ ఇంజినీర్ పై అనుచ‌రుల‌తో క‌లిసి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక‌రు దాడి చేశారు. ముంబ‌యి-గోవా జాతీయ ర‌హ‌దారిపై గుంతులు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న ఆగ్ర‌హంతో ఆయ‌నీ దారుణానికి పాల్ప‌డ్డారు. క‌ణ‌కావ‌లీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ ముఖ్య‌మంత్రి నారాయ‌ణ్ రాణె కుమారుడు. తాజాగా ఆయ‌న రోడ్ల‌పై గుంత‌లు ఉండ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. డిప్యూటీ ఇంజినీర్ ప్ర‌కాశ్ షెడేక‌ర్ పై రెండు బ‌కెట్ల‌తో బుర‌ద‌ను నెత్తిన పోసేశారు. ఈ ఉదంతంలో ఎమ్మెల్యేతో పాటు క‌ణ‌కావ‌లీ పుర‌పాల‌క సంఘం ఛైర్మ‌న్ స‌మీర్ న‌ల‌వాడే కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

అక్క‌డితో ఆగ‌ని వారు స‌ద‌రు అధికారిని స్తంభానికి క‌ట్టేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ ఉదంతం గురించి విన్నంత‌నే పోలీసులు స్పందించారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ ఉదంతంలో 16 మందిని అరెస్ట్ చేశాడు. త‌న కుమారుడి చ‌ర్య ప‌ట్ల మాజీ ముఖ్య‌మంత్రి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఈ వ్య‌వ‌హారం పెను సంచ‌ల‌నంగా మారింది. తప్పులు చేశారంటూ అధికారుల‌పై ప్ర‌జాప్ర‌తినిధులు ఈ త‌ర‌హాలో దాడికి దిగ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. మ‌రి.. త‌మ పార్టీ ఎమ్మెల్యే తీరును రాహుల్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారో?
Tags:    

Similar News