ఉన్నత స్థానంలో ఉన్న నాయకులు గౌరవప్రదంగా వ్యవహరించాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. అలా కాకుండా హుందా తనాన్ని పక్కన పెట్టి శృతిమించిన ఆరాధనను కనబరిస్తే ఎలా ఉటుందో తాజా మరోమారు వెలుగులోకి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు కమల్ నాథ్ ఇలా తమ పార్టీ నాయకుడికి అవకాశం కల్పించి ఇరుక్కున్నారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ - కాంగ్రెస్ నేత ఊర్మిళా సింగ్ కు నివాళులు అర్పించేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కమలనాథ్ వచ్చారు. నివాళులు అర్పించిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రజ్నీష్ సింగ్ కమల్ నాథ్ కు షూ లేస్ ను కట్టడం మీడియా కంట చిక్కింది. దీంతో ఈ దృశ్యాన్ని మీడియా ప్రచారం చేసింది. తద్వారా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కేంద్ర మాజీ మంత్రి - పీసీసీ చీఫ్ కమలనాథ్ కు లేస్ కట్టే అంత స్వామిభక్తిని ప్రదర్శించడం అవసరమా అంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తుండటాన్ని రజ్నీష్ సింగ్ తేలికగా తీసుకున్నారు. కమల్ నాథ్ తనకు తండ్రిలాంటి వారని, తను స్కూలులో చదివే రోజుల నుంచే తన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకునే వాడినని తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఆ గదిలో చాలామంది ఉన్నందున కమల్ నాథ్ బూట్లు కనిపించకపోవడంతో అవి వెతికి తన పాదాల దగ్గర ఉంచినట్లు రజ్నీష్ సింగ్ వివరించారు. కమలనాథ్ లాంటి సీనియర్ నేతపై గౌరవం ఉన్నందునే ఆయన బూటు లేసును కట్టినట్లు ఇందులో తనకు తప్పేమి అనిపించలేదని రజ్నీష్ సింగ్ చెప్పారు. మీడియా అతి ప్రచారం చేయవద్దని కోరారు.