కోమటిరెడ్డి పీచేముడ్.. రేవంత్ పై కోపం తగ్గిందా?

Update: 2021-08-10 16:32 GMT
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి అమ్ముడుపోయిందని.. ఇక ఎప్పటికీ గాంధీ భవన్ గడపతొక్కనని ప్రమాణం చేసి అలిగి వెళ్లిపోయిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి తన మాట మార్చుకున్నాడు. ఆయన మడమ తిప్పేసినట్లే కనిపిస్తోంది. తాజాగా పీసీసీ చీఫ్ గా తనకు పోటీగా నియమితులైన రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తానని తాజాగా ప్రకటించారు.

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కలిసి పనిచేద్దామని తాను రేవంత్ కు సూచించినట్లు ఎంపీ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. సోనియా, రాహుల్ నాయకత్వంలో పనిచేస్తానని.. రేవంత్ రెడ్డికి సహకరిస్తానన్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొద్దామని తాను సూచించినట్టు చెప్పటం కూడా చర్చనీయాంశమైంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆ పని మొదలుపెట్టేశాడు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

పీసీసీ చీఫ్ గా ఎవరున్నా కూడా నిత్య అసమ్మతితో పార్టీని పలుచున చేస్తున్నారనే ఆరోపణలు కోమటిరెడ్డి బ్రదర్స్ చేస్తుంటారన్న విమర్శలున్నాయి. రేవంత్ తోపాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అధిష్టానం రేవంత్ కు పగ్గాలు అప్పగించింది. దాంతో అలిగిన కోమటిరెడ్డి ఏకంగా రేవంత్ పై నోరుపారేసుకున్నారు.

అయితే కోమటిరెడ్డి తను వ్యతిరేకించి అసమ్మతి రేపితే అందరూ కాంగ్రెస్ సీనియర్లు తన వెంట వస్తారని.. పార్టీ చీలి తనకు పట్టం కడుతారని భావించాడు. కానీ కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ కోమటిరెడ్డి వెంట రాకపోయేసరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లేటు ఫిరాయించాడు. ఇప్పుడు రేవంత్ పీసీసీ చీఫ్ గా ఓకే అంటున్నాడు. ఇప్పటికే పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డితో వైరం కంటే స్నేహమే మేలు అని కోమటిరెడ్డి నిర్ణయించుకొని వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.




Tags:    

Similar News