కోమటిరెడ్డి తిక్క కుదిరిందా? షాకిచ్చిన‌ కాంగ్రెస్ !

Update: 2022-12-10 16:19 GMT
ధిక్కారానికి కూడా ఒక హ‌ద్దు ఉండాలి. స‌ముద్రం ఎంత బ‌ల‌మైందైనా.. ఎన్ని న‌దుల‌ను త‌న‌లో క‌లిపేసుకున్నా.. క‌విస‌మ్రాట్ విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ శాస్త్రిగారు చెప్పిన‌ట్టు.. చెలియ‌లిక‌ట్ట‌కు కట్టుబ‌డాల్సిందే. త‌న ప‌రిమితులు త‌ను తెలుసుకోవాల్సిందే.  ఇవి లేక‌పోతే.. ఇదిగో ఇలా.. ఇప్పుడు ఉత్తుత్తి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిగా మారిపోవ‌డం ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు.

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. ఆ పార్టీపైనే ధిక్కార స్వ‌రాన్ని.. స‌రిహ‌ద్దుల వ‌ర‌కు వినిపించేలా చేసిన   సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ పార్టీ హైకమాండ్  గ‌ట్టి అదిరిపోయే షాక్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ కమిటీల్లో   వెంకటరెడ్డికి చోటు లేకుండా చేయ‌డంతోపాటు.. ప్ర‌స్తుతం ఉన్న స్టార్‌ క్యాంపెయినర్‌ పదవిని కూడా పీకేసింది. దీంతో ఇప్పుడు ఆయ‌న ఉత్తుత్తి వెంక‌ట‌రెడ్డి అయిపోయార‌ని కామెంట్లు కురుస్తున్నాయి.

ఏం జ‌రిగింది..?

తాజాగా కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణ పీసీసీని ప్రకటించింది. నలుగురు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లను, అంజన్‌కుమార్‌, మహేష్‌గౌడ్‌, జగ్గారెడ్డి, అజారుద్దీన్‌తోపాటు 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని నియ‌మించింది. దీనికి చైర్మన్‌గా ప్ర‌స్తుత పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని నియమించింది. అదేవిధంగా 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసి, దీనికి చైర్మన్‌గా మాణిక్కం ఠాగూర్‌ను కేటాయించింది. ఇక‌, పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ సభ్యులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్ర‌మార్క‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌న్న‌, మాజీ మంత్రి, మాజీ పీపీసీ చీఫ్ పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ రేణుకాచౌదరిల‌కు అవ‌కాశం ఇచ్చింది.

ఇక‌, మ‌రో 26 మంది నూతన వైస్ ప్రెసిడెంట్లు, 26 జిల్లాలకు కొత్త  డీసీసీ ప్రెసిడెంట్లను నియమించించింది.  24 మంది ఉపాధ్యక్షులతో నూతన కమిటీ, 84 ప్రధాన కార్యదర్శులను కూడా పార్టీ తీర్చిదిద్దింది. ఇదంతా కూడా ఒక‌ర‌కంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వండి వార్చిన విధానాన్నే క‌ళ్ల‌కు క‌ట్టింది. అదేస‌మ‌యంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్‌ కమిటీని ర‌ద్దు చేసి.. గ్రేటర్‌ను హైదరాబాద్, ఖైరతాబాద్ జిల్లాలుగా ఏఐసీసీ విభజించడం గ‌మ‌నార్హం. అయితే, ఎక్క‌డా కూడా ఫైర్ బ్రాండ్ కోమ‌టి రెడ్డికి చోటు పెట్ట‌క‌పోగా.. ఉన్న స్థానాన్ని కూడా తీసేసింది. సో.. ఇదీ సంగ‌తి!!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News