ఆఖరిపోరాటమని అర్ధమైపోయిందా ?

Update: 2022-05-16 05:38 GMT
మరో రెండేళ్ళ తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి ఆఖరి ఎన్నికలని నాయకత్వానికి బాగా అర్ధమైపోయినట్లుంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలన్న పట్టుదల నేతల్లో కనబడుతోంది. అధికారంలోకి రావటం సాధ్యంకాదని అందరికీ తెలిసిందే. అందుకనే కనీసం గణనీయంగా పుంజుకోకపోతే పార్టీని జనాలు మరచిపోవటం ఖాయమని అగ్రనేతలకు అర్ధమైపోయింది.

అంటే 2024  లోక్ సభ ఎన్నికల్లో గనుక పార్టీ పుంజుకోకపోతే ఇక తర్వాత పార్టీగురించి జనాలే కాదు పార్టీ నేతలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం పార్టీకి లోక్ సభలో 53 మంది ఎంపీలున్నారు.

ఈ సంఖ్యగనుక గణనీయంగా పెరగకపోతే పార్టీ బాగా ఇబ్బందుల్లో పడిపోవటం ఖాయం. అందుకనే పార్టీ పునరుజ్జీవనానికి అర్జంటుగా పెద్ద ఆపరేషన్ చేయటానికి అగ్రనేతలు రెడీ అయిపోయారు.

రాజస్ధాన్లోని ఉదయపూర్లో మూడురోజులు జరిగిన చింతన్ శిబిర్ పార్టీ బలోపేతానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రాహుల్ గాంధి పాదయాత్ర, ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో కూడా నేతలు పాదయాత్రలు చేయాలని, యువతకు కీలక బాధ్యతలు అప్పగించాలని, రాహుల్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని, పార్టీకి దూరమైపోయిన జనాలను మళ్ళీ దగ్గరకు తీసుకోవాలని, పార్టీ పదవుల్లో సామిజకన్యాయంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 50 శాతం పదవులు కేటాయించాలనే నిర్ణయాలు మంచివే.

పార్టీకి అసలైన సమస్య వృద్ధనేతలు. వీళ్ళు అనుభవించాల్సిన పదవులన్నింటినీ ఆకాశమే హద్దుగా అనుభవించేశారు. వయస్సైపోయిన తర్వాత ఇపుడు తీరిగ్గా నీతులు మాట్లాడుతున్నారు. పైగా పార్టీలోని యువతను ముందుకు వెళ్ళకుండా ఎక్కడికక్కడ పగ్గాలు వేస్తున్నారు.

వీళ్ళు సమర్ధవంతంగా పనిచేయరు, యువతను ముందుకెళ్ళనీయరు. దీంతోనే సీనియర్లకు, యువనేతలకు మధ్య బాగా గొడవలవుతున్నాయి. ఇలాంటి అనేక రుగ్మతలను దృష్టిలో పెట్టుకునే ఒక కుటుంబానికి ఒక్కరికే టికెట్ అని, రాజ్యసభకు రెండుసార్లకన్నా వరుసగా ఒక నేతను పంపకూడదని నిర్ణయించింది. మరి శస్త్రచికిత్స మొదలైన తర్వాతైనా పార్టీ పరిస్ధితి కోలుకుంటుందేమో చూడాలి.
Tags:    

Similar News