లెక్క పేచీలతో రెండు పార్టీల్లో వణుకు

Update: 2017-01-28 05:23 GMT
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. అందరి చూపు మాత్రం ఉత్తరప్రదేశ్ మీదనే. భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైన యూపీలో పవర్ పాగా ఎవరు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యూపీలో అధికారాన్ని చేజిక్కించుకోవటం బీజేపీ ఎత్తులు వేస్తుండగా.. అందుకు ధీటుగా కాంగ్రెస్ పైఎత్తులు వేస్తోంది. యూపీ అధికారపక్షమైన సమాజ్ వాదీతో కలిసి అడుగులు వేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఇరువర్గాల మధ్య పొత్తు ఉంటుందా? అన్న సందేహం పలువురిలో వినిపించింది.

అయితే.. ప్రియాంకాగాంధీ రంగంలోకి దిగటంతో ఆ సందేహాలు పటాపంచలు అయ్యాయి.రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పటికి  ఇరు వర్గాల మధ్య లెక్కల పంచాయితీ నడుస్తోంది. అన్నింటికంటే ఎక్కువగా గాంధీ ఫ్యామిలీకి పెట్టనికోట లాంటి రాయ్ బరేలీ.. అమేథీ లోక్ సభస్థానాల పరిధిలో నెలకొన్న సీట్ల పంచాయితీ ఒక కొలిక్కి రావటం లేదు.

తమవైన రెండు స్థానాల్లో పట్టు కోసం కాంగ్రెస్ తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరుతుంటే.. పొత్తుకు ముందే విడుదల చేసిన జాబితాలో ఈ రెండింటిలోనూ అభ్యర్థుల్ని సమాజ్ వాదీ ప్రకటించటంతో.. ఈ ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చేందుకు రెండు పార్టీలకు తలకు మించిన భారంగా మారింది. ముందుగా విడుదల చేసిన జాబితాలో ప్రకటించిన వారిని ఉపసంహరించుకొని.. కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి వచ్చే విషయంలో జరుగుతున్న జాప్యం కాంగ్రెస్ వర్గాల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ తీరు పట్ల సమాజ్ వాదీ పార్టీ తీవ్ర అసంతృప్తుతితో ఉంది.

పొత్తు బంధంతో చెట్టాపట్టాలు వేసుకొని దూసుకెళ్లాల్సిన వేళ.. అందుకు భిన్నంగా ఇరువురి మధ్య నెలకొన్న సీట్ల పేచీ అంతకంతకూ ఎక్కువ అవుతుందన్న వాదన వినిపిస్తోంది. అయితే.. సీట్ల పంపకాల విషయంలో నెలకొన్ని ఇబ్బందులు త్వరలోనే అధిగమిస్తామని ఇరు పార్టీల అగ్రశ్రేణి నాయకత్వం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News