కాంగ్రెస్‌ కు కొత్త టెన్ష‌న్ పుట్టిస్తున్న స‌ర్వేలు

Update: 2018-05-07 04:39 GMT
క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు కాంగ్రెస్‌ కు క‌ల‌వ‌రం పుట్టిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్‌ కు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డేకొద్దీ ఈ టెన్ష‌న్ అంత‌కంత‌కూ ఎక్కువవుతోంది. మొన్న‌టివ‌ర‌కూ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ప‌రిస్థితి మెరుగ్గా ఉన్న ప‌రిస్థితికి భిన్నంగా తాజా ప‌రిస్థితులు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

మ‌మ్మ‌ల్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌మాకండి.. మా మోడీ ఇంకా ప్ర‌చారంలోకి దిగ‌లేదు.. ఆయ‌న ఎంట్రీ ఇచ్చాక మొత్తం ప‌రిస్థితి మారిపోతుందంటూ క‌మ‌ల‌నాథులు చెప్పిన మాట‌లు నిజ‌మ‌న్న భావ‌న వ్య‌క్త‌మవుతోంది. తాజాగా వెలువ‌డుతున్న స‌ర్వేలు కాంగ్రెస్‌ కు కంటి నిండా క‌నుకు లేకుండా చేస్తుంటే.. బీజేపీ నేత‌లు రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతున్నారు.

కొద్ది రోజుల ముందు వ‌ర‌కు ముంబ‌యి- క‌ర్ణాక‌ట ప్రాంతంలో బీజేపీ ప‌రిస్థితి ఏ మాత్రం బాగోలేద‌న్న మాట‌కు భిన్నంగా ఇప్పుడా పార్టీ అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డుతోంది. ఈ ప్రాంతానికి చెందిన బెళ‌గావి.. బాగ‌ల్కోటె.. విజ‌య‌పుర‌.. గ‌ద‌గ‌.. హావేరీ.. ధార్వాడ జిల్లాల్లో క‌లిపి మొత్తం 50 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్నాయి. వీటిల్లో అత్య‌ధికం కాంగ్రెస్ ఖాతాలో ఉన్న‌వి కాగా.. ఇప్పుడు ప‌రిస్థితి మారిన‌ట్లుగా అంచ‌నా వేస్తున్నారు.

2013 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డ కాంగ్రెస్‌ కు 31 స్థానాల్ని సొంతం చేసుకుంది. అదే స‌మ‌యంలో బీజేపీ 13 స్థానాల్లో మాత్ర‌మే గెల‌వ‌గ‌లిగింది. బీజేపీ మూడు ముక్క‌లుగా చీలిపోవ‌టం.. వ‌ర్గపోరు కార‌ణంగా అతి త‌క్కువ సీట్ల‌ల్లో మాత్ర‌మే గెలిచింది. ఈ కార‌ణంతోనే నాడు కాంగ్రెస్ ల‌బ్థి పొందిన‌ట్లు చెబుతారు.

ఈసారి ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు ముంబ‌యి.. క‌ర్ణాట‌క ప్రాంతంలోనే గెలుస్తామ‌ని ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఎక్కువ అంచాలు పెట్టుకోవ‌టం ఇప్పుడు కాంగ్రెస్‌ కు ఇబ్బందిక‌రంగా మారింది. మారిన ప‌రిస్థితుల్లో బీజేపీ ఇక్క‌డ లాభ‌ప‌డుతుంద‌న్న స‌ర్వే ఫ‌లితాలు కాంగ్రెస్‌ కు షాకింగ్ గా మారాయి. తాజా అంచ‌నాల ప్ర‌కారం మొత్తం 50 సీట్లల్లో బీజేపీ 27 సీట్ల‌ల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో జేడీఎస్ 2 స్థానాల్లో గెలుస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇదే జ‌రిగితే కాంగ్రెస్‌ కు భారీ న‌ష్టం.. బీజేపీ పెద్ద ఎత్తున ప్ర‌యోజ‌నం పొందే వీలుంటుంది.

రోజులు గ‌డిచే  కొద్దీ ఫ‌లితం సంక్లిష్టంగా మార‌తున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ త‌మ మాజీ అధినేత్రి సోనియాగాంధీనికి ప్ర‌చారంలోకి దింపుతున్నారు. రేపు (మంగ‌ళ‌వారం) ఆమె విజ‌య‌పుర స‌భ‌లో ప్ర‌సంగించ‌నున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ ఈ రోజు (సోమ‌వారం) నుంచి ప్ర‌చారాన్ని మ‌ళ్లీ షురూ చేయనున్నారు. రోజురోజుకీ మారిపోతున్న ప‌రిణామాలు చూస్తే అంతిమ ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News