మొన్న ఈటెల‌.. నిన్న విఠ‌ల్‌.. నేడు మ‌ల్ల‌న్న‌.. రేవంతూ ఏం చేస్తున్నావ్‌..!

Update: 2021-12-07 23:30 GMT
తెలంగాణ రాష్ట్ర స‌మితి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీలో చేరారు మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌. భూ ఆక్ర‌మ‌ణల ఆరోప‌ణ‌లు రావ‌డంతో ప్ర‌భుత్వం మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించింది. దీంతో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు ఈటెల‌. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఆ పార్టీ త‌ర‌పున బ‌రిలో నిలిచి అద్భుత‌మైన మెజారిటీ సాధించి రాష్ట్ర ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ను మార్చేశారు. దీంతో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం బీజేపీనే అనే భావ‌నను క‌లిగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ కో చైర్మ‌న్ విఠ‌ల్ నిన్న ఢిల్లీలో బీజేపీలో చేరారు. కేంద్ర‌మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ స‌మ‌క్షంలో కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగుల స‌మ‌స్య‌లు, ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం ఉద్య‌మం చేశారు విఠ‌ల్‌. రాజ‌కీయంగా ఇక‌పై దూకుడుగా వెళ్లనున్నారు. బీజేపీ లీడ‌ర్‌గా ఉద్య‌మ‌కారుల స‌మ‌స్య‌ల కోసం కొట్లాడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగ నియామ‌కాలు, నీళ్లు, నిధుల అంశాల‌ను ప్ర‌స్తావించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఉద్యోగ సంఘాల పాత ప‌రిచ‌యాల‌తో అధికార పార్టీని నిల‌దీయ‌నున్నారు.

చింత‌పండు న‌వీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న నేడు బీజేపీలో చేరారు. ఢిల్లీకి వెళ్లి తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జి త‌రుణ్ చుగ్ స‌మంక్షంలో పార్టీ కండువా ధ‌రించారు. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టుగా ఉన్నమ‌ల్ల‌న్న‌ అధికార పార్టీ అక్ర‌మాల‌ను, అన్యాయాల‌ను వెలుగుతీశాడు. త‌న సొంత టీం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ నేత‌ల అవినీతిని వెలుగులోకి తెచ్చాడు. ఇది భ‌రించ‌లేని ప్ర‌భుత్వం ఆయ‌న‌పై కేసులు పెట్టి జైలు పాలు చేసింది. చాలా రోజులుగా జైల్లో ఉన్న మ‌ల్ల‌న్న ఇటీవ‌ల బెయిల్‌పై విడుద‌లై ఈ రోజు బీజేపీలో చేరారు. ఇక‌పై త‌న క‌లం ద్వారా.. మాట‌ల ద్వారా టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే అవ‌కాశముంది.

ఇలా రెండు మూడు నెల‌ల నుంచి వ‌రుస‌గా బీజేపీలో చేరిక‌లు జ‌రుగుతుంటే.. టీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయం అని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ సైలెంట్‌గా ఉండ‌టాన్ని అభిమానులు త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఇటీవ‌ల పార్టీకి ఊపు తెచ్చే కార్య‌క్ర‌మాలు పెద్ద‌గా ఉండ‌డం లేద‌ని.. పార్టీ నేత‌లు ఐక్యంగా ఉండ‌క‌పోవ‌డం కూడా ఒక స‌మ‌స్య‌గా మారింద‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు బాధ‌ప‌డుతున్నారు. గ‌తంలో ఎర్ర‌శేఖ‌ర్‌, ధ‌ర్మ‌పురి సంజ‌య్ త‌దిత‌ర నేత‌లు పార్టీలో చేర‌డానికి మొగ్గు చూపినా అధిష్ఠానం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. ఆయా జిల్లాల్లో పాత కాపులు అడ్డుప‌డి చేరిక‌ల‌ను ఆగిపోయేలా చేశారట‌.

హుజూరాబాద్ ఎన్నిక నాటి నుంచి నీర‌స‌ప‌డ్డ పార్టీకి జ‌వ‌స‌త్వాలు ఎక్కించాల‌ని.. తిరిగి పార్టీని గాడిన‌పెట్టేందుకు ఇప్ప‌టికైనా పార్టీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి మేల్కోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందా.. కాంగ్రెస్ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టి బ‌లం పుంజుకుంటుందా.. అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News