చంద్రబాబు, జగన్ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌

Update: 2017-07-06 07:50 GMT
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు - ప్ర‌ధాన‌ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ పై విప‌క్ష కాంగ్రెస్ పార్టీ నేత‌లు మండిప‌డ్డారు. ఎన్డీఏ బ‌ల‌ప‌ర్చిన రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రాంనాథ్ కోవింద్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత‌లు అధికార‌ - ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంపై మండిప‌డ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ మంత్రి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు - ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జేబులో చేరిపోయారని ఆరోపించారు. ఆర్ ఎస్ ఎస్‌ కు అసలు వారసులం మేమేనని చంద్రబాబు - జగన్ నిరూపించారంటూ ఆయన మండిపడ్డారు. ఏపీలో అధికార - ప్రతిపక్షం లేకుండా పోయింద‌ని పేర్కొంటూ ఏపీలో ప్రతిపక్షం కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేన‌ని  అన్నారు.

రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్‌ నాథ్‌ కోవింద్ కాళ్లు మొక్కిన వైఎస్ జగన్ అదే పార్టీకి చెందిన వెంకయ్యనాయుడుతో ఫొటో దిగితే దళిత ఎమ్మెల్యేలను ఎందుకు మందలించారని శైల‌జ‌నాథ్ ప్రశ్నించారు. ఎన్డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా వైఎస్ జగన్ వేసుకున్న సెక్యులర్ ముసుగు తొలగిందని శైలజానాథ్ అన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌ నాథ్‌ కోవింద్ తన అభ్య‌ర్థిత్వం విష‌యంలో చిలక పలుకులు పలుకుతున్నారని  శైలజానాథ్ ఎద్దేవా చేశారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదనడం హాస్యాస్పదమ‌ని అన్నారు. గ‌తంలో ముస్లిం - క్రిస్టియన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను రామ్‌ నాథ్‌ కోవింద్ వెనక్కి తీసుకోవాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌రో సీనియ‌ర్‌ నేత తులసిరెడ్డి సైతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై మండిప‌డ్డారు. ఈ ఇద్ద‌రు నేత‌ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోందని విమర్శించారు. పేరుకు విమ‌ర్శించుకుంటున్నారే త‌ప్ప ఇద్ద‌రు నేత‌ల అజెండా ఒక‌టేన‌ని ఆరోపించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌ నాథ్‌ కోవింద్‌ కు జగన్ మద్దతివ్వడాన్ని తులసిరెడ్డి త‌ప్పుప‌ట్టారు. జగన్‌ కు త‌న‌పై ఉన్న కేసుల కార‌ణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భయం పట్టుకుందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎన్నిక‌ల్లో రాష్ట్రపతి అభ్యర్థిగా ఏపీ సీఎం చంద్రబాబుని పెట్టినా వైఎస్ జగన్ మద్దతిచ్చేవాడంటూ విమర్శించారు. అందుకే భారతీయ జనతా పార్టీ అడగక ముందే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిచ్చారని తులసిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రపతి అభ్యర్థి పాదాలకు జగన్ నమస్కారం చేయాల్సిన పరిస్థితి ఏముందని తులసిరెడ్డి ప్ర‌శ్నించారు. అయితే త‌ప్పు చేసిన వారు ఎప్పుడైనా అందుకు త‌గిన ఫ‌లితం అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌ని తుల‌సి రెడ్డి  అన్నారు.


Tags:    

Similar News