కాంగ్రెస్ లో బ్లాక్ షీప్స్.. క‌నిపెట్టే ప‌నిలో రేవంత్ టీమ్..!

Update: 2021-08-05 10:33 GMT
హుజూరాబాద్ కాంగ్రెస్ నేత‌గా ఉన్న కౌశిక్ రెడ్డి.. ఆడియో రికార్డ్ లీకేజీ వ్య‌వ‌హారం ఎంత దుమారం రేపిందో అంద‌రికీ తెలిసిందే. అప్ప‌టి వ‌ర‌కూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీకి ప‌నిచేశారు కౌశిక్ రెడ్డి. హ‌స్తం పార్టీలో ఉంటూ.. గులాబీ పార్టీ టిక్కెట్ త‌న‌కు రాబోతోంద‌ని చెప్పుకోవ‌డం సంచ‌ల‌నం రేకెత్తించింది. ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డం.. కౌశిక్ ను బ‌హిష్క‌రించ‌డం జ‌రిగిపోయాయి. అయితే.. ఇలాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నార‌నేది సందేహం. అస‌లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీనం అయిపోవ‌డానికి ఇలాంటి బ్లాక్ షీప్స్ కూడా ఓ కార‌ణ‌మ‌న్న‌ది ప్ర‌ధాన విమ‌ర్శ‌.

పార్టీకి ఒక విధానం అన్న‌దే లేకుండా.. నేత‌లు ఎవ‌రి ఇష్టానికి వారు మాట్లాడే సంప్ర‌దాయం కాంగ్రెస్ లో ఉంద‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఏ నేత ఎప్పుడు ఏం మ‌ట్లాడుతారో? తెలియదు. పార్టీలో ఉన్న నేత‌ల‌పైనే వారు విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు. ఎంతో కాలంగా సాగుతున్న ఈ వ్య‌వ‌హారం.. పార్టీని భ్ర‌ష్టుప‌ట్టింద‌ని అంటారు. ఓ ప‌ద్ధ‌తీపాడు అనేది లేకుండా ఎవ‌రి ఇష్టానికి వారు గ్రూపులు న‌డుపుతూ.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంటార‌ని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బ‌తినిపోవ‌డానికి ఇది కూడా మ‌రో ప్ర‌ధాన కార‌ణంగా చెబుతారు.

అయితే.. ఇప్పుడు రేవంత్ వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థితి క్ర‌మంగా మారుతోంద‌ని అంటున్నారు. పార్టీని ప్రక్షాళన చేసే పనికూడా మొదలు పెట్టినట్టు ప్రచారం సాగుతోంది. ఈ మేర‌కు రాహుల్ గాంధీ రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చార‌ని కూడా చెబుతున్నారు. సీనియ‌ర్లు ఎన్నో అడ్డంకులు పెట్టినా.. రేవంత్‌ కు పీసీసీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన రాహుల్‌.. పార్టీలో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునే అధికారం కూడా అప్ప‌గించార‌ని అంటున్నారు. కౌశిక్ రెడ్డి ఉదంతం త‌ర్వాత రేవంత్ ఘాటు హెచ్చ‌రిక‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అమ్ముడు పోయేవారు ఉంటే ఇప్పుడే వెళ్లిపోవాల‌ని, ఇంకా పార్టీలో ఉండి ఇత‌రుల కోసం ప‌నిచేస్తే.. చూస్తూ ఊరుకోబోమ‌ని అన్నారు.

ఆ త‌ర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీలోని బ్లాక్ షీప్స్ ను క‌నిపెట్టే కార్య‌క్ర‌మాన్ని ముమ్మ‌రం చేసిన‌ట్టు స‌మాచారం. పార్టీని గాడిలో పెట్టాలంటే.. కోవ‌ర్టుల‌ను వెలికితీసి సాగ‌నంపాల్సిందేన‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక టీమ్ ను త‌యారు చేసుకొని, అనుమానం ఉన్న‌వారిపై నిఘా పెట్టించిన‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత‌లు ఎవ్వ‌రూ మీడియా ముందు ఒక విధంగా, అంత‌ర్గ‌తంగా మ‌రోవిధంగా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని కూడా తొలి మీటింగ్ లోనే నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇదేమాట‌కు క‌ట్టుబ‌డి అంద‌రూ ప‌ద్ధ‌తిగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అప్పుడే పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని రేవంత్ భావిస్తున్నార‌ట‌.

దీన్ని నేత‌ల‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తు చేస్తున్నారు రేవంత్‌. ఎక్క‌డ స‌మావేశంలో మాట్లాడిన కోవ‌ర్టుల అంశాన్ని తెర‌పైకి తెస్తున్నారు. హుజూరాబాద్ లో టీఆర్ ఎస్ కోసం ప‌నిచేసిన కౌశిక్ రెడ్డి ఉదంతాన్ని ఉద‌హ‌రిస్తున్నారు. మ‌రి, ఈ కోవ‌ర్టుల ఏరివేత కార్య‌క్ర‌మం ఏ మేర‌కు ఫ‌లిస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే.. కాంగ్రెస్ అంటేనే అతి స్వేచ్ఛ క‌లిగిన పార్టీ. ఎవ‌రు ఏమైనా మ‌ట్లాడుతారు. ఎలాగైనా వ్య‌వ‌హ‌రిస్తారు. అందునా.. టీ-కాంగ్రెస్ లో ఉన్న ప్ర‌ధాన నేత‌లంతా సీనియ‌ర్లే. రేవంతే జూనియ‌ర్‌. మ‌రి, రేవంత్ గీసిన గీత దాట‌కుండా సీనియ‌ర్లు ఉంటారా? అనేది చూడాలి.




Tags:    

Similar News