కాంగ్రెస్‌ కు ఆ రాష్ట్రంలో దారుణ అవ‌మానం!

Update: 2017-08-18 04:34 GMT
కాంగ్రెస్‌కు అదృష్ట రాష్ట్రంగా ఏపీని అభివ‌ర్ణిస్తారు. ఏ రాష్ట్రంలో విజ‌యం సంగ‌తి ఎలా ఉన్నా.. ఏపీతో వ‌చ్చే సీట్ల‌తో ఆ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న సెంటిమెంట్ ఉంది. దీనికి భిన్నంగా రాష్ట్ర విభ‌జ‌న పుణ్య‌మా అని.. ఏపీలో కాంగ్రెస్ క‌నుమ‌రుగు కావ‌ట‌మేకాదు.. స‌మీప భ‌విష్య‌త్తులో ఆ పార్టీకి ఎలాంటి అవ‌కాశం లేద‌న్న విష‌యం తేలిపోయిన సంగ‌తి తెలిసిందే. చేసిన త‌ప్పున‌కు ఊహించ‌నంత భారీ మూల్యాన్ని కాంగ్రెస్ చెల్లిస్తోంది. ఏపీలో మొద‌లైన అవ‌మానం.. వ‌రుస పెట్టి ప‌లు రాష్ట్రాల్లో ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది.

తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి దిమ్మ తిరిగిపోయే అవ‌మానం ఒక‌టి ఎదురైంది. మొత్తం ఏడు స్థానిక సంస్థ‌ల్లో 148 వార్డుల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒక్క‌టంటే ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ గెల‌వ‌క‌పోవ‌టం ఆ పార్టీని తీవ్ర నిరాశ‌.. నిస్పృహ క‌మ్మేలా చేస్తోంది.

మొత్తం 148 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే.. 140 చోట్ల అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ తిరుగులేని అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించి.. ఆ స్థానాల్ని సొంతం చేసుకుంది. ఇక‌.. మిగిలిన ఎనిమిది వార్డుల్లో ఆరు చోట్ల బీజేపీ.. ఒక్క‌చోట వామ‌ప‌క్షాలు.. మ‌రోచోట స్వ‌తంత్ర అభ్య‌ర్థి విజ‌యం సాధించారు.

 కాంగ్రెస్ పార్టీకి ఒక్క‌టంటే ఒక్క చోట కూడా విజ‌యం సాధించ‌లేదు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ప‌శ్చిమ‌బెంగాల్ లో అధికార‌ప‌క్షం త‌ర్వాత బీజేపీ రెండో స్థానంలో నిల‌వ‌గా.. సుదీర్ఘ‌కాలం అధికారంలో ఉన్న వామ‌ప‌క్షాలు మూడో స్థానంతో స‌రిపెట్టుకుంది. ఇక‌.. కాంగ్రెస్ నాలుగో స్థానంలో నిల‌వ‌ట‌మే కాదు.. ఏపీలో మాదిరే ప‌శ్చిమ‌బెంగాల్ లోనూ త‌న పాత్ర ఏమీ లేద‌న్న విష‌యం కాంగ్రెస్ పార్టీకి తాజా ఎన్నిక‌ల‌తో రుజువైంద‌ని చెప్పాలి. శ‌తాధిక వృద్ధ కాంగ్రెస్ కు ఏపీ మాత్ర‌మే కాదు.. అదే త‌ర‌హాలో ఉన్న మ‌రో రాష్ట్రం వారు చేసిన త‌ప్పుల‌కు సాక్ష్యంగా నిలిచింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News