ఒక‌ప్ప‌టి కంచుకోట‌లో కాంగ్రెస్ మ‌రీ ఇలానా!

Update: 2020-02-11 14:30 GMT
ఐదేళ్ల కింద‌ట ఢిల్లీలో కాంగ్రెస్ చిత్తు అయ్యింది - సున్నా సీట్ల‌కు ప‌రిమితం అయ్యిందంటే అదో లెక్క‌. అప్ప‌టికి ఇంకా దేశ వ్యాప్తంగా యూపీఏ ప్ర‌భుత్వంపై ఉండిన వ్య‌తిరేక‌త త‌గ్గ‌క‌పోవ‌డంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తు అయిపోయింద‌ని అంతా అనుకున్నారు. బీజేపీకీ అతిగా అవ‌కాశం ఇవ్వ‌కుండా - కాంగ్రెస్-బీజేపీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఢిల్లీ ప్ర‌జ‌లు ఆమ్ ఆద్మీ స‌ర్కారుకు అవ‌కాశం ఇచ్చార‌నే విశ్లేష‌ణ‌లు వినిపించాయ‌ప్పుడు. అందునా.. అంత‌కు ముందు మూడు ప‌ర్యాయాలు ఢిల్లీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ ఏక‌ప‌క్షంగా అధికారాన్ని క‌ట్ట‌బెట్టి ఉన్నారు.

అలాంటి వ్య‌తిరేక‌త‌కు తోడు.. ఢిల్లీలో కాంగ్రెస్ హాయాంలో భారీ స్కామ్ లు జ‌రిగిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. కామ‌న్ వెల్త్ స్కామ్ తో సహా - అప్ప‌టి ఢిల్లీ ముఖ్య‌మంత్రి షీలా దీక్షిత్ త‌న‌యుడు కూడా భారీ అవినీతికి పాల్ప‌డ్డాడు అనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అలాంటి వాట‌న్నింటి న‌డుమ కాంగ్రెస్ పార్టీ చిత్తు అయ్యింది. ప‌దిహేనేళ్ల పాటు తిరుగులేకుండా అధికారాన్ని చెలాయించిన రాష్ట్రంలో కాంగ్రెస్ సున్నా సీట్ల‌కు ప‌రిమితం అయ్యింది.

ఐదేళ్లు గ‌డిచిపోయాయి. ఆప్ ఐదేళ్ల పాల‌న అనంత‌రం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ ప‌రిస్థితి మాత్రం మార‌లేదు. కొద్దో గొప్పో బీజేపీ బ‌లోపేతం అయ్యింది. ఐదేళ్ల కింద‌ట బీజేపీ త‌ర‌ఫున ముగ్గురు నెగ్గితే ఇప్పుడు ప‌ది మందికి పైగా నెగ్గే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం మ‌ళ్లీ పాత ఫ‌లితాల‌నే పొందుతూ ఉంది!

సున్నా లేదా ఒక్క సీట్లో కాంగ్రెస్ గెలిస్తే అదే గొప్ప‌లా క‌నిపిస్తూ ఉంది. వ‌ర‌స‌గా 15 యేళ్లు ఏలిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ‌ర‌స‌గా రెండో సారి సున్నాకే ప‌రిమితం అవుతున్న‌ట్టుగా ఉంది! కాంగ్రెస్ మూలాలు ఢిల్లీలో అడ్ర‌స్ లేకుండా పోయాయి. ఆప్ పూర్తిగా వాటిని సొంతం చేసుకుని కాంగ్రెస్ ను చిత్తు చేసింది. ఆప్ పై వ్య‌తిర‌కేత ఏదైనా ఉంటే అది బీజేపీకి ఓటు గా మారింది కానీ, కాంగ్రెస్ మాత్రం ఢిల్లీలో డ‌క్కౌట్ స్థాయికి ప‌రిమితం అయ్యింది.
Tags:    

Similar News