ఈ లెక్కకు కేసీఆర్ ఏం చెబుతారో?

Update: 2016-08-18 13:00 GMT
‘లక్ష కోట్లు.. కోటి ఎకరాలు’ పేరుతో తెలంగాణ సర్కారు చేపట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ కాంగ్రెస్ దండయాత్ర షురూ చేసింది. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంలో భాగంగా పలు ప్రాజెక్టులను రూపొందించటం.. రీడిజైనింగ్ అన్న కేసీఆర్ మాటలో మాయ ఉందని.. భయంకరమైన కుంభకోణం ఉందని వాదిస్తోంది. తెలంగాణ సర్కారు చెబుతున్న వాదనలో విషయం లేదని.. అదంతా ఉత్త ఫార్సుగా తేల్చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కొద్ది నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఇరిగేషన్ పై ఇచ్చిన ప్రజంటేషన్ కు కౌంటర్ అన్నట్లుగా వాస్తవ జలదృశ్యం పేరిట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజంటేషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన ఈ ప్రజంటేషన్లో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

లక్ష కోట్లు ఖర్చు పెడితే కోటి ఎకరాలు సాగులోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా.. అంత భారీ మొత్తం కాకుండా కేవలం రూ.10వేల కోట్లు ఖర్చు చేయగలిగితే ఏకంగా 37 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం 37 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలంటే కనీసం రూ.35వేల కోట్లు అవసరమవుతాయి. కానీ.. అంత మొత్తం అక్కర్లేదని కేవలం రూ.10వేల కోట్లు సరిపోతుందని చెప్పటం గమనార్హం.

తెలంగాణ కాంగ్రెస్ చెప్పిన లెక్కను చూస్తే..  కాంగ్రెస్ హయాంలో పలు ప్రాజెక్టులు ప్రారంభించామని.. అవి ప్రస్తుతం 90 శాతం నుంచి 99 శాతం వరకూ పూర్తయిన ప్రాజెక్టులు ఉన్నాయని చెబుతున్నారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు 22 శాతం పూర్తి అయ్యిందని.. ఇప్పుడు కానీ రూ.8970 కోట్ల ఖర్చు పెట్టాలే కానీ.. దాదాపు 29 లక్షల ఎకరాల వరకూ సాగులోకి వస్తుందన్నారు. మరో రూ.860 కోట్లు ఖర్చు చేసిన పక్షంలో ఏకంగా 7.9లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని వెల్లడించారు.

 లోతైన అధ్యయనం వదిలేసి.. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్ని పక్కన పెడుతున్నారని.. వాటిని పూర్తి చేసేందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. చిన్న మొత్తం ఖర్చుతో లక్షలాది ఎకరాల్ని సాగులోకి తెచ్చే వీలున్నా.. అలాంటివేమీ లేకుండా వ్వవహరిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వేలాది కోట్ల ఖర్చు చేస్తున్నతెలంగాణ ప్రభుత్వం కేవలం రూ.10వేల కోట్ల ఖర్చు విషయంలో ఎందుకు వెనుకాడుతోంది? అన్న ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ తెర మీదకు తెచ్చిన నేపథ్యంలో కేసీఆర్ సర్కారు ఏం సమాధానం చెప్పనుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News