కాంగ్రెస్ మూలాలు బల‌ప‌డిన‌ట్టేగా!

Update: 2017-03-11 11:17 GMT
ఇప్పుడంతా ఐదు రాష్ట్రాల అసెంబ్లీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌పైనే చ‌ర్చంతా. ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ‌. అయినా ఈ ఎన్నికల ఫ‌లితాలు ఎవ‌రికి అనుకూలంగా ఉన్నాయి?... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఘ‌న విజ‌యంతో పెద్ద విక్ట‌రే అనుకున్నా... పంజాబ్ లో ఆ పార్టీతో జ‌త‌క‌ట్టి శిరోమ‌ణి అకాలీద‌ళ్ చేప‌ట్టిన అధికారం కాస్తా.. కాంగ్రెస్ కు ద‌ఖ‌లు ప‌డిన క్ర‌మంలో ఆ పార్టీ పూర్తిగా విజ‌యం సాధించ‌లేద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన పార్టీదే పూర్తి స్థాయి విజ‌యం అని చెప్పేందుకు అస‌లు వీలే చిక్కడం లేదు. మొన్న‌టిదాకా ఉత్త‌ర‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన పార్టీదే కేంద్రంలోనూ విజ‌య‌మ‌న్న వాద‌న ఉంది. అయితే ఆ విష‌యాన్ని ఇప్పుడు అంతా మార్చుకోవాల్సిన ప‌రిస్థితే నెల‌కొంద‌న్న వాద‌న లేకపోలేదు. ఎందుకంటే గడ‌చిన ఎన్నిక‌ల్లో స‌మాజ్‌ వాదీ పార్టీ ఆ రాష్ట్ర అసెంబ్లీని క్లీన్ స్వీప్ చేసినా... మొన్న‌టి సాధార‌ణ ఎన్నికల్లో అంత‌గా రాణించ‌లేక‌పోయింద‌న్న వాస్త‌వం మ‌న క‌ళ్ల ముందే క‌ద‌లాడుతోంది.

మ‌రి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఇప్పుడు విజ‌యం సాధించిన బీజేపీ... వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో కేంద్రంలో మ‌రోమారు అధికారం చేప‌డుతుంద‌ని చెప్పేందుకు కూడా అవ‌కాశం లేని ప‌రిస్థితి మ‌న‌కు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌విచూసిన కాంగ్రెస్ పార్టీకి అప‌జ‌య‌మే ఎదురైందా?... అంటే కూడా స‌మాధానం లేని ప్ర‌శ్న కిందే లెక్క‌. ఎందుకంటే... మొన్న డిజాల్వ్ అయిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఆ పార్టీకి పెద్ద‌గా సీట్లేమీ లేవు. ప్రాంతీయ పార్టీగా ఉన్న బహ‌జ‌న స‌మాజ్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉండ‌గా... జాతీయ పార్టీగా హోదా ఉన్నా... ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఆ పార్టీ నేత‌ల‌లు యువ‌రాజుగా ప‌రిగ‌ణిస్తున్న రాహుల్ గాంధీ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు అదే రాష్ట్రంలో ఉన్నా... ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆ పార్టీకి పెద్ద‌గా సీట్లేమీ లేవు. ఈ క్ర‌మంలో  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బీజేపీకి ద‌క్కిన విజ‌యం కాంగ్రెస్ అప‌జ‌యంగా చెప్ప‌డానికి వీల్లేదు.

అదే స‌మ‌యంలో బీజేపీ-ఆకాలీద‌ళ్ పాల‌న‌లో ఉన్న పంజాబ్‌ లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. అంతేకాకుండా... బీజేపీ పాల‌న‌లో ఉన్న గోవాలోనూ బీజేపీతో స‌మానంగా సీట్లు సాధించే దిశ‌గా కాంగ్రెస్ ప‌య‌నిస్తోంది. ఇక ఉత్త‌రాఖండ్‌ లోనూ కాంగ్రెస్ పార్టీ హ‌వా ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని తాజా ఓట్ల లెక్కింపే చెబుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప‌రాజ‌యం పాలైంద‌ని చెప్ప‌డానికి ఏమాత్రం ఆస్కారం లేక‌పోగా... బీజేపీ చేతిలోని రెండు రాష్ట్రాల్లో అధికారం చేప‌ట్టే దిశ‌గా సాగుతున్న ఆ పార్టీ... ముమ్మాటికీ విజయం సాధించిన‌ట్లుగానే చెప్పుకోవాలి. ఇప్ప‌టికే పంజాబ్‌ లో ఓట‌మిని అంగీక‌రించిన అకాలీద‌ళ్ నేత - ఆ రాష్ట్ర సీఎం ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్... ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఇక ఫ‌లితాలు పూర్తిగా వెలువ‌డేలోగా... గోవా నుంచి కూడా ఇదే ప‌రిస్థితి పున‌రావృత‌మ‌య్యే ప‌రిస్థితి  క‌నిపిస్తోంది. హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నిక‌ల్లో ఒక‌వేళ బీజేపీనే విజ‌యం సాధించిన‌ప్ప‌టికి కూడా... ఆ పార్టీ సీఎం అభ్య‌ర్థి ల‌క్ష్మీకాంత్ ప‌ర్సేక‌ర్ అనూహ్యంగా ఓట‌మి చ‌విచూశారు. అంటే అక్క‌డ బీజేపీ గెలిచినా... ఆ పార్టీ సీఎంగా ఉన్న ప‌ర్సేక‌ర్ రాజీనామా చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఎతావ‌తా ఈ ఎన్నిక‌లు యూపీ గెలుపుతో బీజేపీకి పెద్ద బూస్ట్ గా అనిపించినా... కాంగ్రెస్ పార్టీ మాత్రం గ‌తంలో కంటే పుంజుకున్న‌ట్లుగానే క‌నిపిస్తోంది. అంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న ఆ పార్టీ మూలాలు ఇంకా బ‌లంగానే ఉన్నాయ‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News