సర్వే చేసి సత్తా తెలుసుకుంటున్నారు!

Update: 2016-09-25 22:30 GMT
ఏపీలో రాజకీయ పార్టీలకు కసరత్తు కంటే కండలు చూసుకోవడం ఎక్కువైంది. జిమ్ లో కసరత్తులు చేయడానికి పరికరాలున్నట్లే కండలు చూసుకోవడానికి అద్దాలూ ఉంటాయి. బాడీ పెంచాలనుకునేవారు జిమ్ పరికరాలతో పనిచేస్తుంటే... కొంచెం చేయగానే రిజల్టు కావాలని ఆశపడే అత్యాశపరులు అద్దం ముందు కనిపిస్తుంటారు. ఇప్పుడు ఏపీలో రాజకీయ పార్టీలూ అదే పద్ధతిలో ఉన్నాయి. ప్రజలకు ఏం చేయాలి.. ప్రజల కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాలి... లేదంటే ప్రజల తరఫున ఎలాంటి పోరాటాలు చేయాలి అని ఆలోచించాల్సిన పాలక - విపక్షాలన్నీ ఆ పనులు మానేసి మేం ఇప్పటివరకు చేసిందే చాలా ఎక్కువ అనుకుంటూ వాటిపై ప్రజాభిప్రాయం సేకరించే పనిలో పడుతున్నాయి. సర్వేలతో నవ్యాంధ్రను చుట్టేస్తున్నాయి.

ఏపీలో ప్రధాన పార్టీలన్నీ బలాబలాలపై సర్వే చేయించుకుంటున్నాయి. ప్రజల నాడి తెలుసుకునేందుకు అధికార తెలుగుదేశం - ప్రతిపక్ష వైకాపాతో పాటు గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీ సైతం సర్వే చేయిస్తోంది. ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు అప్పగించి ప్రజాభిప్రాయం ఎలాఉందో తెలుసుకునే ప్రయత్నంలో అన్ని రాజకీయపక్షాలు నిమగ్నమయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించి రెండున్నర సంవత్సరాలు గడవడం - ప్రత్యేక హోదాపై కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం - రాష్ట్రంలో అధికార టిడిపిపై ప్రజల మనోభావాలు - హామీల అమలు తీరు - ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు వంటి అనేక ప్రశ్నలతో కూడిన జాబితాను ప్రజలకు అందించి వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో 2014 ఎన్నికల తరువాత అధికార పార్టీ రాయలసీమలో ఒకింత మెరుగైన స్థితిని సాధించిందన్న అభిప్రాయం ఆ పార్టీ సర్వే సంస్థల ద్వారా వెల్లడైంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్న శ్రద్ధ కారణమని తేలింది. ప్రజలకు వ్యక్తిగత లబ్దిచేకూర్చే పథకాల విషయంలో కూడా క్షేత్ర స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలను రాబట్టవచ్చని సూచించినట్లు తెలుస్తోంది.

వైకాపా తరపున సర్వే చేసిన సంస్థ ప్రధానంగా రాయలసీమలో ప్రత్యేక హోదా డిమాండ్ ప్రజల్లో లేదని దానిపై కాకుండా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పనుల్లో జాప్యం - అవినీతి - ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం వంటి విషయాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని వెల్లడించినట్లు తెలుస్తోంది. వైకాపాకు 2014లో లభించిన ఓట్ల శాతం అలాగే ఉందని పార్టీలు మారిన ఎమ్మెల్యేల స్థానంలో నియమితులైన ఇన్‌ చార్జి నేతలు పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు సమాచారం.

ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఇంకా ఆగ్రహం చల్లారలేదని ఆ పార్టీ నిర్వహించిన సర్వేలో తేలినట్లు సమాచారం. కాంగ్రెస్ నిర్వాకం కారణంగా విడిపోవడమే కాకుండా ప్రత్యేక హోదా రాకుండా పోయిందని ప్రజలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో కాంగ్రెస్‌ పై ఆదరణ పెరుగుతోందని వెల్లడైనట్లు సమాచారం.

మొత్తానికి సర్వేల ఫలితాలు చూస్తే ఎవరి గ్రాఫ్ కూడా కొత్తగా పెరిగిందీ లేదు - తగ్గిందీ లేదన్నట్లుగా ఉంది. అయితే... వైసీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలను టీడీపీ ఎత్తుకెళ్లినా కూడా వైసీపీకి 2014 నాటి ఓట్ల పర్సంటేజికి ఢోకా రాకపోవడం గొప్ప విషయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News