కాంగ్రెస్‌...మ‌ర‌క మంచిది అనుకోలేదు

Update: 2017-12-08 04:32 GMT
`కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌`ఇది పైకి..కాస్త గౌర‌వ‌ప్ర‌దంగా చెప్పే మాట‌. కానీ ఆ పార్టీ రాజ‌కీయాల గురించి తెలిసిన వారు దీన్ని ఎలా గ్ర‌హిస్తారంటే...`గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఎవ‌రేం మాట్లాడినా చెల్లుతుంది. అడ్డూఅదుపు ఉండ‌దు. మంచీ చెడూ అస‌లే ఆలోచించ‌చ‌రు.త‌మ‌కు న‌చ్చిందే చేస్తారు` అని. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ లో సీన్ మారిపోతోంది. `మ‌ర‌క మంచిదే` అనే భావ‌న నుంచి మారిపోతోంది. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు...క్ర‌మ‌శిక్ష‌ణ వేటు వేసేస్తున్నారు. ఇదంతా తాజా ఉదంతాన్ని గ‌మ‌నించిన వారు చెప్తున్న‌మాట‌.

ఇంత‌కీ విష‌యంలోకి వెళితే...గురువారం ఉదయం ఢిల్లీలో అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్‌ పై పరోక్షంగా విమర్శలకు దిగారు. కొన్ని పార్టీలు అంబేద్కర్ పేరును అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకుంటూ - భారత జాతి నిర్మాణానికి ఆయన అందించిన సేవలను మరుగున పడేస్తున్నాయని మోడీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తీవ్రంగా స్పందించారు.  `మోడీ కనీస సభ్యత పాటించకుండా మంచి కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా వాడుకున్నారని, ఆయన ఓ నీచమైన మనిషి`అని వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీ - కాంగ్రెస్ పరస్పరం తీక్షణమైన విమర్శలు చేసుకుంటున్న తరుణంలో మణిశంకర్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

అయ్యర్ వ్యాఖ్యలు గుజరాత్‌ను అవమానించడమేనని మోడీ అన్నారు. `ప్రజాస్వామ్యం ఆమోదించని భాషలో కాంగ్రెస్ నేతలు మా ట్లాడుతున్నారు. ఉన్నత చదువులు చదివి - దౌత్యవేత్తగా - కేంద్రమంత్రిగా పనిచేసిన ఓ కాంగ్రెస్ నేత నన్ను నీచ్ అని అన్నారు. ఇది మొఘలుల మనస్తత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది` అని మోడీ గుజరాత్‌ లో జరిగిన ఓ బహిరంగసభలో వ్యాఖ్యానించారు. `వారు నన్ను పదే పదే అవమానించారు. నేను సీఎంగా ఉన్నప్పుడు మౌత్‌ కా సౌదాగర్ (మృత్యుబేహారి) అన్నారు. ఇలాంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడుతాం? 9 - 14 తేదీల్లో జరిగే ఎన్నికల్లోనే వారికి మనం బుద్ధి చెబుదాం` అని మోడీ ప్రజలనుద్దేశించి అన్నారు.

ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. ఎన్నికల వేళ సున్నితమైన అంశాలు పార్టీకి ఎంత నష్టం చేకూరుస్తాయోనని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జోక్యం చేసుకుని ప్రధానికి క్షమాపణలు చెప్పాల్సిందిగా అయ్యర్‌ కు సూచించారు. `కాంగ్రెస్ పార్టీపై దాడి చేసేందుకు ప్రధాని - బీజేపీ పార్టీ ఎన్నో పరుష పదాలు వాడుతుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇందుకు భిన్నం. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. వెంటనే మోదీకి క్షమాపణలు చెప్తారని ఆశిస్తున్నా` అని రాహుల్ ట్వీట్ చేశారు. అయితే తాను హిందీలో వక్తను కానని, భాషపై పూర్తిగా పట్టులేక అలాంటి పదాలు వాడాల్సి వచ్చిందని అయ్యర్ వివరణ ఇచ్చారు. `నేను ఆయన మనస్తత్వం గురించే అలా అన్నాను కానీ - తక్కువ జాతి అన్న అర్థంలో పదాన్ని వాడలేదు. నా వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించండి` అని మణిశంకర్ అయ్యర్ కోరారు.

అయినప్పటికీ మణిశంకర్ వ్యాఖ్యల దుమారం సద్దుమణగకపోవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆయనను తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్‌ లో తెలిపారు. `కాంగ్రెస్ పార్టీ గాంధేయవాదానికి కట్టుబడి ఉంది. ప్రత్యర్థినైనా మా పార్టీ గౌరవిస్తుంది. సీనియర్ నేత అయినప్పటికీ మణిశంకర్ అయ్యర్‌ కు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయనను పార్టీనుంచి సస్పెండ్ చేసింది. ఇలాంటి చర్యల్ని మోడీ ఎప్పుడైనా ధైర్యంగా నిర్ణయం తీసుకోగలరా?` అని సూర్జేవాలా ప్రశ్నించారు. కాగా, ఒక ప్రధానిని నీచమైన వ్యక్తిగా సంబోధించడం భారత రాజకీయాల్లో ఇదే తొలిసారి. 2014 ఎన్నికల సందర్భంగా అమేథీలో ప్రచారం నిర్వహించిన ప్రియాంకగాంధీ.. మోడీ నీచరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
Tags:    

Similar News