యూపీఏ రాష్ర్టపతి అభ్యర్థి మళ్లీ ప్రణబే..

Update: 2017-04-22 06:08 GMT
రాష్ట్రపతి పదవికి ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తి  నెలకొంది. తమ అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో ఎన్డీఏ - యూపీఏలు ఇప్పటికే నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా రాష్ట్రపతి పదవిని తామే కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బాగా కలసి వచ్చే అంశం. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములు కావడం.. బీజేపీలో జోష్ పెంచుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలా అనే పనిలో బీజేపీ అధిష్ఠానం తలమునకలై ఉంది. మరోవైపు, గెలిచే ఛాన్సు లేదని తెలిసి కూడా  రాష్ట్రపతి పదవికోసం అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ కూడా యోచిస్తోంది. జేడీయూ - లెఫ్ట్ పార్టీలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దించే యోచనలో ఉన్నాయి.
    
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నేతలు పలు ఇతర  పార్టీలతో ఇప్పటికే మంతనాలు జరిపారు. నితీష్ కుమార్ - సీతారాం ఏచూరీలు సోనియాగాంధీతో ఈ విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ అంశంపై సోనియాతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపుతున్నారని సమాచారం.  ప్రస్తుతం బీజేపీ ప్రదర్శిస్తున్న దూకుడును తగ్గించాలంటే... మళ్లీ ప్రణబ్ ముఖర్జీనే రెండోసారి రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
    
ప్రణబ్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారైనప్పటికీ ఎన్టీయేతో ఈ మూడేళ్ల కాలంలో వ్యవహారాలన్నీ స్మూత్ గానే సాగాయి. ప్రధాని మోడీకి - రాష్ర్టపతి ప్రణబ్ కు మధ్య ఎక్కడా తేడాలు రాలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రణబ్ ను రంగంలోకి దించితే మోడీ కాస్త మొహమాటపడాల్సిన పరిస్థితి వస్తుందని... అదే సమయంలో ఇతర పార్టీలు కూడా ప్రణబ్ కు మద్దతిస్తాయని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఆయన పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News