జంపింగ్‌ ల‌కు అఫిడ‌విట్ తో చెక్ పెడ‌తారట‌!

Update: 2019-04-17 04:43 GMT
తెలంగాణ‌లో చోటు చేసుకున్న సిత్ర‌మైన రాజ‌కీయం గురించి తెలిసిందే. అభ్య‌ర్థి ఎవ‌రైనా.. పార్టీ ఏదైనా.. గెలిచినోళ్లంతా.. గులాబీ కారులో ఎక్కేందుకు ప్ర‌ద‌ర్శిస్తున్న ఉత్సాహం విప‌క్షాల‌కు వ‌ణుకు పుట్టిస్తోంది. జంపింగ్స్ కు బ్రేకులు వేసేందుకు స‌రికొత్త ఆలోచ‌న‌ను తెర మీద‌కు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇటీవ‌ల జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత.. మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ కొత్త త‌ర‌హా ఎత్తుగ‌డ‌ను తెర మీద‌కు తెచ్చారు.

ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చే అభ్య‌ర్థుల చేత‌.. ఎన్నిక‌ల్లో గెలిచాక‌ పార్టీ మార‌నంటూ  అఫిడ‌విట్ తీసుకోవాల‌న్న ఆలోచ‌న చేశారు. ఇలా తీసుకోవ‌టం ద్వారా.. పార్టీ ఫిరాయింపుల‌కు బ్రేక్ ప‌డుతుంద‌న్న‌ది వారి ఆశ‌. తాజాగా జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులంద‌రి చేత ఈ అఫిడ‌విట్ తీసుకున్న తీరులోనే.. తాజాగా జ‌రిగే జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నిక‌ల్లోనూ అఫిడ‌విట్ ల‌ను తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

స్థానిక ఎన్నిక‌ల అనంత‌రం ఫిరాయింపులు.. బేర‌సారాల‌కు ఎక్కువ‌గా అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో.. అఫిడ‌విట్ తీసుకోవ‌టం ద్వారా.. అలాంటి వాటికి చెక్ పెట్టొచ్చ‌ని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. ఒక‌వేళ‌.. అఫిడ‌విట్ ఇచ్చిన త‌ర్వాత కూడా జంపింగ్ కు పాల్ప‌డితే చీటింగ్ కేసు పెట్టొచ్చ‌న్న ఆలోచ‌న‌లో పార్టీ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. చ‌ట్ట‌ప‌రంగా ఈ అఫిడ‌విట్ తో అయ్యేదేమీ ఉండ‌ద‌ని.. నైతిక‌త పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్ర‌మే ఇది ప‌నికి వ‌స్తుందంటున్నారు.

ఏది ఏమైనా.. పార్టీ నుంచి జంప్ కానంటూ అఫిడ‌విట్ తీసుకున్నాక టికెట్ ఇచ్చే ఈ ధోర‌ణి.. ఎలాంటి ఫ‌లితాలు ఇస్తుంద‌న్న‌ది ఇప్ప‌టికిప్పుడే చెప్ప‌లేం. ఎందుకంటే.. అఫిడ‌విట్ తో చెక్ పెట్టాల‌ని కాంగ్రెస్ భావిస్తుంటే.. దానికి విరుగుడు సూత్రాన్ని క‌నిపెట్ట‌కుండా కేసీఆర్ ఉంటారా? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. ఏమీ చేయ‌కుండా ఉండే క‌న్నా.. ఏదో ఒక ప్ర‌య‌త్నం చేయ‌టం మంచిద‌న్న‌ట్లుగా కాంగ్రెస్ క‌నిపించ‌క‌మాన‌దు.  
Tags:    

Similar News