ప్రధాని పదవిపై సంచలన వ్యాఖ్యలు..మాట మార్చిన కాంగ్రెస్ నేత

Update: 2019-05-17 16:30 GMT
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొంత కాలంగా అనుకూల పవనాలు వీస్తున్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న ఆ పార్టీ.. ప్రస్తుత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయేను ఓడించాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే దేశంలోని ప్రధాన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడడానికి సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆ పార్టీకి మద్దతు తెలిపారు. ఆయనతో పాటు పలువురు ముఖ్యమంత్రులు - ఇతర పార్టీల అధినేతలు బీజేపీయేత కూటమి ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఈ ప్రయత్నాలను బలంగానే చేసుకుంటూ పోతోంది.

 వాస్తవానికి - కొద్దిరోజుల క్రితం వరకూ.. అవసరమైతే ప్రధాని పదవిని వదులుకునైనా భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని భావించింది. కానీ, ఆ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో పుంజుకుంది. అంతేకాదు - పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఆ పార్టీ అధిష్ఠానంలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. అప్పటి నుంచి రాహుల్ గాంధీని ప్రధానిగా ఎన్నుకోవాలని ఆ పార్టీ నేతలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాని పదవి విషయంలో మాత్రం ఏమీ తేల్చుకోలేకపోతోంది. రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా బలంగా ప్రతిపాదించడమా లేక ప్రాంతీయ పక్ష నేతకు అవకాశం ఇవ్వడమా అన్న విషయమై వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.

 ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘అత్యధిక స్థానాలతో పెద్ద పార్టీగా మేం అవతరించినా ప్రధానిగా ఏ ప్రాంతీయ పార్టీ నేతను చేయడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ హైకమాండ్‌ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఏ ప్రాంతీయ పక్ష నేతకైనా ప్రధాని అయ్యేందుకు మేం సహకరిస్తాం. ప్రధాని పదవి దక్కకపోయినంత మాత్రాన మేమేమీ రాద్ధాంతం చెయ్యం...అది పెద్ద సమస్యే కాదు’’ అన్నారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చిచ్చు రేగింది. దీంతో ఆయన తాజాగా మాట మార్చారు.

 దేశంలోనే మాది చాలా పెద్ద పార్టీ. చాలా చరిత్ర ఉన్న పార్టీ కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలంటే కాంగ్రెస్ పార్టీకే మద్దతు ప్రకటించాలి. ప్రధాని పీఠంపై మాకు ఆసక్తి లేదన్న మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఐదేళ్లూ ఓ ప్రభుత్వం సుస్థిరంగా నడవాలంటే అతి పెద్ద పార్టీకే అవకాశం ఇవ్వాలి. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధాని పదవిపై మనలో మనం కొట్టుకోవడం భావ్యం కాదు. చర్చల ద్వారానే అభ్యర్థిత్వాన్ని పరిష్కరించుకోవాలి. ఎన్నికల తరవాత కాంగ్రెస్సే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది’’ అంటూ ఆయన తన మాటలకు వివరణ ఇచ్చారు.
Tags:    

Similar News