అపాయింట్ మెంట్ ఇస్తే.. మీ మేడం వస్తారా?

Update: 2015-10-14 17:30 GMT
సాధారణంగానే ఆంధ్రులకు ఆరంభ శూరులన్న పేరుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరు చూస్తూంటే దానికన్నా ఇంకా దారుణంగా వుంది.  ఆరంభించాలంటే తమ పార్టీ పెద్దల దగ్గర నుండీ రావాలనే చిన్న విషయాన్ని కూడా మరిచి ఏకంగా తామే ప్రధానమంత్రితో 5నిమిషాల పాటు చర్చించి సాధించేయగలమనే వారి ఆశావహదృక్పధం కాస్త హాస్యాస్పదంగానే అనిపిస్తోంది. కాంగ్రెస్ హోదా ఎప్పుడో ఇచ్చేసింది.. అనుకుంటూ.. నానిపోయిన డైలాగు వేసుకుంటూ.. ప్రజల సానుభూతి కోరుకుంటున్న ఏపీసీసీ.. తమ మేడం సోనియాతో,  లేదా రాహుల్ తో తమ పోరాటానికి మద్దతు ఎందుకు ఇప్పించుకోలేకపోతున్నదో అర్థం కాని సంగతి. ఇంట గెలవలేకుండా, రచ్చ గెలవాలనే వారి ప్రయత్నం జాలి గొలిపే విషయం.

రాష్ట్ర విభజన తరువాత ఇరు రాష్ట్రాల్లోనూ పూర్తిగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు అటు పార్టీ నాయకత్వం దగ్గర ఏమీ చెప్పలేక అప్పట్లో విభజనను అడ్డుకోలేకపోయారు, ఇప్పుడు ఆంధ్రకు ప్రత్యేక హోదా గురించి తమ పార్టీ పెద్దల చేత ఒక నిర్దిష్టమైన ప్రకటన ఇప్పించడంలోనూ విఫలమయ్యారు.  తాజాగా ఇప్పుడు జగన్ చేసిన దీక్షకు మద్దతు ప్రకటించిన దిగ్గీ రాజా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ ఏ మేరకు చిత్తశుద్ధిగా వుందో తరచి చూసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.  ఇక మన నేతల విషయానికి వస్తే వీరు తమ పార్టీ హైకమాండ్ కు పూర్తిగా తలొగ్గి వారితో ఒక్క ప్రకటనైనా చేయించలేని తమ అసమర్ధతను కప్పిపుచ్చుకొనేందుకు తిరుపతిలో ఒక భారీ స్థాయి బహిరంగ సభ ఏర్పాటు చేసారు, అది కాస్తా ఒక కార్యకర్త ఆత్మాహుతితో శృతి తప్పింది.  

ఇప్పుడు తాజాగా రాజధాని శంకుస్థాపనకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి5 నిమిషాల పాటు చర్చించి, ప్రత్యేక హోదా గురించి విన్నవించేస్తాం అంటూ వారు అపాయింట్మెంట్ అడుగుతున్నారు. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఏం సాధించబోతున్నారో వాళ్ళకే తెలియాలి.  ఇక్కడ తమ పార్టీకి దిక్కూ మొక్కూ లేని స్థితిలో ఉన్నది గనుక.. ప్రత్యేక హోదా అనే అంశాన్ని పట్టుకుని ఏపీసీసీ నాయకులు వేగులాడుతున్నారు. దక్కేది కాదని డౌటు ఉన్నప్పటికీ.. ప్రధాని తో భేటీకి సమయం అడుగుతున్నారు. ఏది ఏమైనా.. తమ పార్టీ అధినేత్రి.. సోనియాను రంగంలోకి దించి, ఆమె నోటి ద్వారా డిమాండు చేయిస్తే తప్ప.. కేంద్రం మీద అది ఒత్తిడి తెచ్చినట్లు కాదు. ఏపీసీసీ నాయకులు వెళ్లి మేడం సోనియాను , రాహుల్ ను కలిసి తిరిగి రావడం.. వారు తమ ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతు ఇస్తాం అన్నారని చిలక పలుకులు వల్లించడం వలన ప్రయోజనం లేదు. ఇప్పటికైనా సరే.. ప్రధాని ఎపాయింట్ మెంట్ ఇస్తే.. ఆ భేటీకి సోనియాను గానీ, రాహుల్ ను గానీ... తీసుకువెళ్లే దమ్ము, నమ్మకం ఏపీసీసీ నాయకులకు ఉన్నాయా? వారి ద్వారా ఒత్తిడి తెస్తే మాత్రమే పనవుతుంది.  ఏ పెద్దలయితే హోదాను ఇచ్చేశారు కదా.. అని వీరు అంటున్నారో.. ఆ పెద్దలనే రంగంలోకి దించితే తప్ప లాభం ఉండదని, తమ తాటాకు చప్పుళ్లకు మోడీ బెదరడని వారు తెలుసుకోవాలి.
Tags:    

Similar News