కరోనాతో నిండా మునిగాక మేల్కొన్న కాంగ్రెస్

Update: 2020-04-11 17:30 GMT
ఆలస్యం.. అమృతం.. విషం అంటారు.. ఏదైనా స్పందించాల్సిన టైంలో స్పందిస్తేనే దానికి విలువ.. ఇప్పుడు స్పందించినా పట్టించుకునే నాథుడే ఉండడు..కరోనా పుట్టింది.. పెరిగింది.. ఇప్పుడు పరిగెడుతోంది.. అయినా ఇన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీ మేలుకోవడం విశేషమే మరీ.. హమ్మయ్యా.. చివరకు.. కరోనా వైరస్ పై కాంగ్రెస్ మేల్కొందని సంతోష పడాలి.

భారతదేశం కరోనాతో పోరాడటం ప్రారంభించిన దాదాపు రెండు నెలల తరువాత కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ పై తన మొట్టమొదటి సమీక్ష సమావేశాన్ని తాజాగా నిర్వహించింది. శుక్రవారం సాయంత్రం, సోనియా గాంధీ దేశంలోని వివిధ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల ముఖ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దేశంలోని కరోనా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

కరోనా ప్రబలుతున్నా దేశంలోనే అతి పురాతన పార్టీ కాంగ్రెస్ ఇప్పటి వరకు తన పార్టీ కార్యకర్తలకు పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడం దారుణమే మరీ... తత్ఫలితంగా, కొంతమంది కాంగ్రెస్ సంస్థాగత నెట్‌వర్క్ కేడర్ మొత్తం క్రియారహితంగా ఉంది. ఇంట్లోనే ఎవరికి వారు చద్దరి కప్పుకొని ఏసీలు, కూలర్ల కింద బజ్జున్నారు.

ఈ కరోనా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ తరుఫున ఏ ఒక్క నాయకుడూ ప్రజా ఉపయోగ పనులు చేయడం లేదన్న విమర్శ ఉంది. కాంగ్రెస్ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయితే ఇంట్లో వంట చేస్తూ గడిపేస్తున్నారు. దేశంలో ఎంతో మంది విలువైన నాయకులున్నా ఏ కాంగ్రెస్ వాది పేదలు, అర్థాకలితో ఉన్న వారికి ఆహారం పంపిణీ చేయడానికి ముందుకు రాలేదన్న ఆరోపణలున్నాయి. పేద వలస కార్మికుడికి మార్గదర్శకత్వం ఇవ్వడానికి వీధుల్లో కనిపించడం లేదు. రేషన్ పదార్థాల పంపిణీని పర్యవేక్షించడానికి ఏ కాంగ్రెస్ నాయకుడూ ప్రయత్నించకపోవడం గమనార్హం.

మొత్తం మీద, అధిష్టానం చెప్పలేదు.. స్థానిక కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. దీంతో సుబ్బరంగా నాయకులందరూ తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రజల కోసం ఆచరణాత్మకంగా ఏమీ చేయలేదు.

చివరకు సోనియా గాంధీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడంతో, పార్టీ కేడర్ ఇప్పటికైనా మేలుకుంటుందని ఆశిస్తున్నారు. అయితే, ఈ సమీక్ష సమావేశంలో అందరూ నిధుల కొరత, పేలవమైన కేటాయింపులు, సరిపోని కరోనా టెస్టింగ్ కిట్లు వంటి అంశాలపైనే ప్రధానంగా చర్చించారట.. సోనియా గాంధీ కూడా సరిపోని నిధులు.. ఇతర సమస్యల గురించి మాట్లాడారట.. కానీ పార్టీ నాయకులను.. కార్యకర్తలను పెద్దగా ప్రజలకు మద్దతుగా సహాయాన్ని అందించడానికి సోనియా పిలుపునివ్వకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రజలు కష్టాల్లో ఉంటే ఇంతటి దుర్లభంగా వ్యవహరించడం అందరినీ షాక్ కు గురిచేస్తోందని అంటున్నారు.
Tags:    

Similar News