రేసులోకి వ‌చ్చేందుకు కాంగ్రెస్ క‌ష్టాలు

Update: 2022-02-07 00:30 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో పుంజుకునేందుకు ఉన్న మంచి అవ‌కాశాల‌ను కాంగ్రెస్ ఇప్ప‌టివ‌ర‌కూ పెద్ద‌గా వాడుకోలేద‌నే చెప్పాలి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడే ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్ప‌డింది. కానీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనే భావ‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో విఫ‌ల‌మైంది. అందుకే 2014 నుంచి రాష్ట్రంలో జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లో దారుణ ఫ‌లితాలు మూట‌గ‌ట్టుకుంది. మ‌రోవైపు తొలి సారి సీఎం అయ్యాక కేసీఆర్‌.. ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కుల‌ను టీఆర్ఎస్‌లోకి ఆక‌ర్షించి పోటీ అనేది లేకుండా చేయాల‌ని చూశారు. ఇక రెండోసారి ఘ‌న విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చి విప‌క్షాల‌ను నిర్వీర్యం చేశార‌నే చెప్పాలి. మ‌రోవైపు ఎంత‌సేపు త‌మ ప్ర‌యోజ‌నాల కోస‌మే సీనియ‌ర్ నాయ‌కులు ప‌ని చేశారు కానీ కాంగ్రెస్ పార్టీని ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శ‌లున్నాయి. దీంతో పార్టీ తిరిగి పుంజుకోవ‌డం క‌ష్ట‌మే అనిపించింది.

కానీ అత‌నొచ్చాక‌..

గ‌తేడాది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టాక రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దూకుడు నైజంతో సాగే రేవంత్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి కేసీఆర్‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీని న‌డిపించేందుకు రేవంత్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. కానీ మ‌ధ్య‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో దారుణ‌మైన ఫ‌లితాలు.. పార్టీలోని సీనియ‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల రేవంత్ జోరుకు క‌ళ్లెం ప‌డేలా క‌నిపించింది. మ‌రోవైపు కేసీఆర్ కూడా బీజేపీని టార్గెట్ చేసి కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాల‌ని చూస్తున్నారు. బీజేపీని లేపి.. కాంగ్రెస్‌ను ప్ర‌జ‌లకు దూరం చేయాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌ణాళిక‌గా చెబుతున్నారు.

ఆ వ్యాఖ్య‌ల‌తో..

తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు స‌రైన పోటీ బీజేపీ అనే భావన ప్ర‌జ‌ల్లోకి వ‌స్తే అది కాంగ్రెస్‌కు తీవ్ర న‌ష్టాన్ని చేకూర్చే ప్ర‌మాదం ఉంది. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన రేవంత్‌.. ఇప్పుడు కేసీఆర్‌పై టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్రంగా విరుచుకుప‌డుతూ మైలేజీ కొన‌సాగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు అన్యాయంపై కేసీఆర్ ప్ర‌శ్నిస్తూ.. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌నే వ్యాఖ్య‌లు చేశారు. అవి ఇప్పుడు తీవ్ర దుమారంగా మారాయి. ఆ వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టుకున్న కాంగ్రెస్ నానా యాగీ చేస్తుంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న‌పై దేశ ద్రోహం కింద కేసు న‌మోదు చేయాలంటూ రేవంత్ ఆధ్వ‌ర్యంలో పార్టీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇదే అవ‌కాశంగా వాడుకుని తిరిగి రేసులోకి వ‌చ్చేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.
Tags:    

Similar News