మాష్టారికి త‌క్క‌వ సీట్లు..డిప్యూటీ సీఎం పోస్ట్ ఆఫ‌ర్

Update: 2018-10-15 04:55 GMT
తెలంగాణ‌లో జ‌ర‌గాల్సిన ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి మ‌హాకూట‌మిలోని పార్టీల మ‌ధ్య పొత్తుల లెక్క తేల‌క‌పోవ‌టం తెలిసిందే. దాదాపు 40 రోజుల క్రింద‌టే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టిస్తే.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు మాత్రం ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. సీట్ల స‌ర్దుబాటు లెక్క‌లు తేల‌క కిందా మీదా ప‌డుతున్నాయి.

త‌మ‌తో పొత్తు పెట్టుకునే పార్టీల‌కు సీట్లు కేటాయించే విష‌యంలో ఆచితూచి అన్న‌ట్లుగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కూట‌మిలోని టీడీపీ.. టీజేఎస్.. సీపీఐ పార్టీలు కోరిన‌న్ని సీట్లు ఇచ్చే విష‌యంలో తొంద‌ర‌ప‌డ‌ని కాంగ్రెస్ తాజాగా ఆస‌క్తిక‌ర ప్రతిపాద‌న‌ను కోదండం మాష్టారికి చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

దాదాపు పాతిక సీట్ల వ‌ర‌కూ టీజేఎస్ అడుగుతుంటే.. మూడు.. నాలుగు స్థానాలు మాత్ర‌మే ఇస్తాన‌ని తొలుత కాంగ్రెస్ నేత‌లు స్ప‌ష్టం చేశారు. అయితే.. అంత త‌క్కువ సీట్ల‌ను పొత్తును ఒప్పుకుంటే ఫ్యూచ‌ర్లో న‌ష్ట‌పోతామ‌న్న వాద‌న‌ను కోదండం మాష్టారు వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అదే స‌మ‌యంలో కోదండం మాష్టారు కోరిన‌ట్లుగా సీట్లు స‌ర్దుబాటు చేస్తే.. ఎన్నిక‌ల్లో క‌ష్ట‌మ‌వుతుంద‌న్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. టీజేఎస్‌కు సంబంధించి ఒక స్ప‌ష్ట‌త‌ను కాంగ్రెస్ ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం. సీట్ల స‌ర్దుబాటుపై తాము చెప్పిన‌ట్లుగా మాష్టారు విన్న‌ప‌క్షంలో.. త‌మ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే పక్షానికి కోదండం మాష్టారిని ఛైర్మ‌న్ గా నియ‌మించ‌టంతో పాటు.. డిప్యూటీ సీఎం ప‌ద‌విని క‌ట్ట‌బెడ‌తామ‌న్న ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. ఈ ప్ర‌తిపాద‌న‌కు కోదండం మాష్టారు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పక త‌ప్ప‌దు. నాలుగైదు సీట్లు త‌గ్గినా.. కీల‌క‌మైన ఛైర్మ‌న్ ప‌ద‌వి.. డిప్యూటీ సీఎం హోదా ప్ర‌తిపాద‌న మాస్టారిని ఆలోచ‌న‌ల్లో ప‌డేసిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. మాష్టారి నిర్ణ‌యం ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News