రాజ‌స్థాన్ లో బీజేపీకి కాంగ్రెస్ షాక్!

Update: 2018-02-01 17:30 GMT

మ‌రో ఏడు నెల‌ల్లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అధికార బీజేపీకి కాంగ్రెస్ షాకిచ్చింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజే బీజేపీకి  ఎదురుదెబ్బ తగిలింది. రాజ‌స్థాన్ లోని రెండు లోక్‌సభ స్థానాలు - ఒక అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. రాజ‌స్థాన్ సీఎం వసుంధర రాజే ప్రభుత్వానికి ప‌ట్టున్న‌ అజ్మేర్‌ - అల్వార్‌ లో బీజేపీ ఓట‌మిపాల‌వ‌డంతో ఆ పార్టీ ఖంగుతింది. ఈ మూడూ బీజేపీ సిట్టింగ్ స్థానాలు కావ‌డం విశేషం. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతోన్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ ఉప ఎన్నికలను అధికార బీజేపీ - ప్రతిపక్ష కాంగ్రెస్ లు సెమీఫైనల్‌గా భావించాయి. బీజేపీ త‌ర‌పున సీఎం వసంధరారాజే - కాంగ్రెస్ త‌ర‌పున రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ హోరాహోరీగా ప్రచారం చేశారు. 2014లో రాజ‌స్థాన్ లో ఒక్క ఎంపీ సీటు గెల‌వ‌ని కాంగ్రెస్ రెండు లోక్ స‌భ స్థానాల్లో గెలుపొంద‌డంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సాహాలలో మునిగితేలుతున్నాయి.

ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలు సన్వర్‌ లాల్‌ జాట్‌ (అజ్మీర్‌) - మహంత్‌ చంద్‌ నాథ్‌ యోగి (అల్వార్‌) - సిట్టింగ్‌ ఎమ్మెల్యే కీర్తి కుమారీ (మండల్‌గఢ్‌) చనిపోవడంతో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. అల్వార్‌ లోక్‌ సభ స్థానంలో భాజపా అభ్యర్థి జశ్వంత్‌ యాదవ్ పై కాంగ్రెస్‌ అభ్యర్థి కరణ్‌ సింగ్‌ 1,56,319 ఓట్ల తేడాతో గెలుపొందారు. అజ్మేర్ లోక్‌ సభ స్థానాన్ని కూడా బీజేపీ కోల్పోయింది. మందల్ గఢ్‌ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ప్రత్యర్థిపై 13వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ ధకద్‌ గెలుపొందారు. ఓట్ల లెక్కింపు మొద‌లైన‌ప్ప‌టినుంచి కాంగ్రెస్‌ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే వచ్చింది. అజ్మేర్‌ స్థానంలో కొద్దిసేపు బీజేపీ పోటీనిచ్చినా.... కాంగ్రెస్ విజ‌యాన్ని అడ్డుకోలేక‌పోయింది.
Tags:    

Similar News