మాకెన్ ను పార్టీ కార్యకర్తే బండబూతులు తిట్టేశాడు

Update: 2016-06-21 04:51 GMT
కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ ను పార్టీకి చెందిన ఒక కార్యకర్త తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. బండబూతులు తిట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదంతా రాహుల్ 46వ జన్మదినోత్సవం సందర్భంగా చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. రాహుల్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి.. తన గోడును వెళ్లబోసుకునేందుకు పార్టీకి చెందిన దళిత కార్యకర్త ధర్మపాల్ రాహుల్ కార్యాలయానికి వచ్చారు.

ఇటీవల ధర్మపాల్ కుమారుడు మరణించాడు. తన గోడును వెళ్లబోసుకోవాలని భావించిన ఆయన్ను.. మాకెన్ కలుగజేసుకొని రాహుల్ ను కలుసుకోకుండా చేశారు.  దీనిపై సదరు కార్యకర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకెన్ పై చెలరేగిపోయారు. ఆవేశంతో పార్టీ సీనియర్ నేత అన్న విషయాన్ని పట్టించుకోకుండా బండ బూతులు తిట్టేశారు. ఈ అంశంపై ధర్మపాల్ మాట్లాడుతూ మాకెన్ తనను బెదిరించినట్లు వాపోయాడు. పార్టీ సీనియర్ నేతకు.. కార్యకర్తకు మధ్య నెలకొన్న పంచాయితీని గుర్తించిన పార్టీ సీనియర్ నేత అస్కార్ ఫెర్నాండ్ సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు.

మాకెన్ ను కలిసిన ఆయన.. ఈ ఇష్యూ మరింత పెద్దది కాకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ ను కలిసేందుకు తనకు అనుమతి ఇవ్వకుండా.. అడ్డుకున్న మాకెన్ పై పార్టీ చర్యలు తీసుకోవాలని ధర్మపాల్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి.. పార్టీ కార్యకర్తల నిరసన ఇబ్బంది కలిగించేదే. అయినా.. పార్టీకి బలమైన కార్యకర్తల విషయంలో సీనియర్ నేతలకు ఎందుకంత చిన్నచూపు అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News