కాంగ్రెస్ కార్యకర్త శపథం నెరవేరింది.

Update: 2018-12-27 09:31 GMT
తెలంగాణ వచ్చేవరకు ఓ ఉద్యమకారుడు 7 ఏళ్లు అరగుండు, అరమీసంతో  నిరసన తెలిపాడు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తేనే గడ్డం తీస్తానని.. లేకపోతే తీయనని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఇక కాంగ్రెస్ గెలవకపోతే పీక కోసుకుంటానంటూ బండ్ల గణేష్ శపథాలు చేశారు. ఎవ్వరూ ఎన్ని డైలాగులు కొట్టినా అవన్నీ నెరవేరవని.. పంతాల మీద నిలబడరని జనాలకు తెలుసు. అందుకే వారు వేయాల్సిన వారికే ఓటేశారు.

కానీ మధ్యప్రదేశ్ లో ఒక కాంగ్రెస్ కార్యకర్త మాత్రం అలా కాదు.. 15 ఏళ్లుగా కాంగ్రెస్ గెలుపు కోసం పోరాడుతున్నాడు. కాంగ్రెస్ గెలిచేదాకా చెప్పులు తొడగనని శపథం చేశారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచింది. 2003లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ 15 ఏళ్ల తర్వాత తాజాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  

2003లో ఘోర పరాజయం తర్వాత అప్పటి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీఎం దిగ్విజయ్ సింగ్ ఓటమికి బాధ్యతగా దశాబ్ధం పాటు తాను ఎన్నికల్లో పోటీచేయనని.. రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోనని ప్రకటించారు. ఇక ఆ ఓటమితోనే కాంగ్రెస్ కార్యకర్త దుర్గా లాల్ కిరార్ కూడా రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా చెప్పులు వేసుకోనని శపథం చేశాడు. దాని ప్రకారమే 15 ఏళ్లుగా చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు.

ఎట్టకేలకు కాంగ్రెస్ విజయం సాధించడం.. కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయింది. దీంతో స్వయంగా సీఎం కమల్ నాథ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సమక్షంలో దుర్గాలాల్ తన శపథానికి స్వస్తి పలికాడు. 15 ఏళ్ల తర్వాత బూట్లు తొడిగాడు. కమల్ నాథ్ దుర్గాలాల్ చెప్పులు తొడుగుతున్న ఫొటోను షేర్ చేసి ‘కాంగ్రెస్ కోసం శ్రమించిన కార్యకర్తలకు నా సాల్యూట్’ అంటూ ట్వీట్ చేశారు.
    

Tags:    

Similar News