రెండు రాష్ట్రాల స‌ఖ్య‌త చెడగొట్టే కుట్రః డిప్యూటీ సీఎం

Update: 2021-07-04 10:37 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ మ‌ధ్య మొద‌లైన‌ జ‌ల వివాదం రోజురోజుకూ ముదురుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుండ‌గానే.. తాజాగా రైతులు న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. రెండు రాష్ట్రాల నీటి పంచాయ‌తీ కార‌ణంగా త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోందంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన‌ అన్న‌దాత‌లు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చెంత‌కు చేరారు. ఈ నేప‌థ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రెండు రాష్ట్రాల స‌ఖ్య‌త‌ను చెడ‌గొట్టేందుకు కొద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు.

ఏపీ అక్ర‌మ ప్రాజెక్టులు నిర్మిస్తోంద‌ని తెలంగాణ‌.. తెలంగాణ అనుమ‌తి లేకుండా విద్యుత్ ఉత్ప‌త్తి మొద‌లు పెట్టింద‌ని ఏపీ.. పోట్లాడుకుంటున్న సంగ‌తి తెలిసిందే. శ్రీశైలంతో పాటు.. నాగార్జున సాగ‌ర్‌, దాని కింద ఉన్న పులిచింత ప్రాజెక్టులోనూ విద్యుత్ ఉత్ప‌త్తి మొద‌లు పెట్టడంతో వివాదం మ‌రింత పెరిగింది. దీనివ‌ల్ల వేలాది క్యూ సెక్కుల నీరు దిగువ‌కు వెళ్లిపోతోంది. పులి చింత‌ల నుంచి ప్ర‌కాశం బ్యారేజీ వైపు భారీగా వ‌ర‌ద నీరు వ‌స్తుండ‌డంతో.. అనివార్యంగా ప్ర‌కాశం బ్యారేజీ గేట్ల‌ను ఎత్తేశారు ఏపీ అధికారులు. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 9,000 క్యూసెక్కుల నీటిని స‌ముద్రంలోకి విడుద‌ల చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డిన‌ది భార‌త్ - పాకిస్తాన్ లాంటి వివాద‌మేమీ కాద‌న్నారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డం బాధాక‌ర‌మేన‌న్న ఆయ‌న‌.. సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తెలుగు ప్ర‌జ‌లంతా ఒకే త‌ల్లి బిడ్డ‌ల‌ని, అయితే.. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య స‌ఖ్య‌త‌ను చెడ‌గొట్టేందుకు కొంద‌రు కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆరోపించారు.

గ‌తంలో కేసీఆర్ తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు రాయ‌ల‌సీమ రైతుల‌ను ఆదుకోవాల‌ని కోర‌గా.. నీళ్లివ్వాల‌ని త‌ప‌న ప‌డ్డార‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు చాలా అభిమాన‌మ‌ని అన్నారు.

రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల జ‌గ‌డం ముదురుతున్న వేళ‌.. డిప్యూటీ సీఎం చేసిన ఈ వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. అయితే.. ఇద్ద‌రు సీఎంల స‌ఖ్య‌త‌ను చెడ‌గొట్టేది ఎవ‌రు? అన్న విష‌యం మాత్రం ఆయ‌న చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News