కాపుల‌ను, ద‌ళితుల‌ను విడ‌దీయ‌డానికి కుట్ర చేశారా?

Update: 2022-07-04 07:50 GMT
కాపుల‌ను, ద‌ళితుల‌ను విడ‌దీయ‌డానికి కుట్ర జ‌రిగిందా అంటే అవున‌నే అంటున్నారు.. ద‌ళిత నేత‌, మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్. కోన‌సీమ జిల్లాకు పేరు మార్పు పేరుతో కాపులు, ద‌ళితుల మ‌ధ్య విభేదాలు సృష్టించ‌డానికే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ర‌గ‌డ సృష్టించింద‌ని హ‌ర్ష‌కుమార్ చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ద‌ళితుల‌పైనే ఎట్రాసిటీ కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డుతున్నారు.

తాజాగా విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలో జ‌రిగిన ద‌ళితుల సింహ‌గ‌ర్జ‌న స‌భ‌లో హ‌ర్ష‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ద‌ళితుల‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోగా అన్యాయం జ‌రిగింద‌ని మండిప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన ప‌థ‌కాల‌కు సైతం జ‌గ‌న్ ప్ర‌భుత్వం కోత వేస్తోంద‌ని నిప్పులు చెరిగారు.

ద‌ళితుల‌పై ఎట్రాసిటీ కేసుల విష‌యంలో విచార‌ణ ఎంత‌వ‌ర‌కు వ‌చ్చిందో హైకోర్టు జ‌డ్జి, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారితో విచార‌ణ జ‌రిపించాల‌ని హ‌ర్ష‌కుమార్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే వైఎస్సార్సీపీ అధికారంలోకి వ‌చ్చాక ద‌ళితుల నుంచి తీసుకున్న అసైన్డ్ భూముల‌కు సంబంధించి వారికి ఆర్ఆర్ ప్యాకేజీ కింద న‌గ‌దు చెల్లించాల‌ని కోరారు. ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే సెప్టెంబ‌ర్ 25న ప‌ది ల‌క్ష‌ల మంది ద‌ళితులతో రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ద‌ళితుల సింహ గ‌ర్జ‌న నిర్వ‌హించి త‌మ స‌త్తా ఏంటో చూపిస్తామ‌ని హెచ్చ‌రించారు.

కాగా హ‌ర్ష‌కుమార్ చెప్పిన‌ట్టే కాపులు, దళితుల‌ను విడ‌దీయ‌డానికే కోన‌సీమ జిల్లా పేరు మార్పు అంశంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ర‌గ‌డ చేసింద‌ని జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. తాము ముందు నుంచీ చెబుతున్న‌దే ఇప్పుడు హ‌ర్ష‌కుమార్ చెబుతున్నార‌ని వారు గుర్తు చేస్తున్నారు. తామెప్పుడూ అంబేడ్క‌ర్ పేరు కోన‌సీమ జిల్లాకు పెట్ట‌డానికి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేద‌ని అంటున్నారు. పైగా కోన‌సీమ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరు పెట్టాల‌ని డిమాండ్ చేసిందే జ‌న‌సేన పార్టీ అని గుర్తు చేస్తున్నారు.

కోన‌సీమ‌లో అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉంటున్న కాపులు, దళితుల మ‌ధ్య చిచ్చుపెట్టి రాజ‌కీయ ల‌బ్ధి పొంద‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింద‌ని హ‌ర్ష‌కుమార్ చెప్ప‌డం ముమ్మాటికి నిజ‌మ‌ని జ‌న‌సేన పార్టీ నేత‌లు చెబుతున్నారు. కోన‌సీమ‌లో అల్ల‌ర్లు సృష్టించింది వైఎస్సార్సీపీ నేత‌లేన‌ని ఘంటాప‌థంగా పేర్కొంటున్నారు. ప్ర‌తిప‌క్షాల‌పై నింద నెట్టి జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌ప్పించుకుంద‌ని గుర్తు చేస్తున్నారు.

2004, 2009లో అమ‌లాపురం ఎంపీగా హ‌ర్ష‌కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2014లో మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జై స‌మైకాంధ్య పార్టీ (జేఎస్పీ) నుంచి పోటీ చేసి హ‌ర్ష‌కుమార్ ఓడిపోయారు.
Tags:    

Similar News