కేంద్ర హోంమంత్రికే షాకిచ్చిన పోలీసులు!

Update: 2017-10-19 04:29 GMT
సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ కే పోలీసులు షాకిచ్చారు.ఆయన పర్యటన సందర్భంగా 250మంది పోలీసు కానిస్టేబుళ్లు మూకుమ్మడిగా సెలవు తీసుకున్నారు. వీరిలో రాజ్‌ నాథ్‌ కు గౌరవ వందనం సమర్పించాల్సిన వారు సైతం ఉన్నారు. వీరి స్థానంలో అప్పటికప్పుడు వేరే పోలీసులను తీసుకోవాల్సి వచ్చింది. రాజస్థాన్ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర హోంశాఖ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. వాట్సాప్‌ లో చక్కర్లు కొట్టిన ఓ మెసేజ్‌ ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.

పోలీసు శాఖకు సంబంధించి రాజస్థాన్‌ ప్రభుత్వం ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం.. కానిస్టేబుళ్ల వేతనాల్లో కోతపడే అవకాశముందంటూ సోషల్‌ మీడియాలో ఓ మెసేజ్‌ వైరల్‌ అయ్యింది. ఇదిలా ఉంటే.. జోథ్‌ పూర్‌ లోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో రీజినల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ను ప్రారంభించేందుకు రాజ్‌ నాథ్‌ సింగ్‌ సోమవారం వెళ్లారు. కాగా.. ఆయనకు గౌరవ వందనం సమర్పించాల్సిన వారితో సహా 250 మంది సెలవులో వెళ్లిపోయారు. దీంతో హడావిడిగా వేరే పోలీసులను నియమించి గౌరవ వందనం ప్రక్రియను ముగించాల్సి వచ్చిందని పోలీస్‌ కమిషనర్‌ అశోక్‌ రాథోడ్‌ వెల్లడించారు. వీరిలో ఎవరికీ సెలవు మంజూరు చేయలేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు సెలవు పెట్టిన వారిలో కొందరు పోలీసులు తప్పకుండా హాజరు కావాలంటూ ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశామని రాష్ట్ర డీజీపీ అజిత్‌ సింగ్‌ వెల్లడించారు. సెలవు పెట్టిన వారందరికీ నోటీసులు జారీ చేసి - తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని రాజస్థాన్‌ హోంశాఖ మంత్రి గులాబ్‌ చంద్‌ కటారియా అన్నారు.

మ‌రోవైపు జీతం రూ.24వేల నుంచి రూ.19వేలకు తగ్గించబోతున్నారని వాట్సాప్‌ కేంద్రంగా వచ్చిన వార్తలపై ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయలేదని సెలవులో వెళ్లిన పోలీసులు తెలిపారు. తమ ఆవేదనను తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు చెప్పారు. అంతేకాక.. జైపూర్‌ లోని సివిల్‌ లైన్స్‌ మెట్రోస్టేషన్‌ లో విధులు నిర్వహిస్తున్న 10 మంది పోలీసులు సోమవారం గుండ్లు కొట్టించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. జీతాల్లో కోతపై నిరసన తెలిపిన తమ సహోద్యోగులు ఆరుగురిని బదిలీ చేశారని వారు ఆరోపించారు.
Tags:    

Similar News