మహా పోటీ; నువ్వు ఒకటైతే.. నేను రెండు చేస్తా?

Update: 2016-04-16 05:59 GMT
ఆరోగ్యకర పోటీ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఏపీ రాజధాని అమరావతికి వెళ్లాల్సిందే. ఏపీ రాజధానిలో తాత్కాలిక సచివాలయం కోసం పోటాపోటీగా పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పనులు నత్తనడకను తలపిస్తాయనే మాటలకు భిన్నంగా.. వాయు వేగంతో పనులు సాగిపోవటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పనుల వేగం ఎంతలా ఉందంటే.. ఓ వారం రోజుల పాటు వెలగపూడి వైపునకు వెళ్లకుండా.. ఆ తర్వాత వెళితే అరే.. ఇంతలో అంతగా మారిపోయిందా? అన్న భావన కలగటం ఖాయం.

తాత్కాలిక సచివాలయాన్ని జూన్ మొదటివారానికి పూర్తి చేయాలన్న లక్ష్యానికి తగ్గట్లే ఆ నిర్మాణాలకు కాంట్రాక్ట్ పొందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలైన ఎల్ అండ్ టీ..  షాపూర్ జీ పల్లోంజీలు పోటాపోటీగా పని చేస్తున్నాయి. మీరో శ్లాబు వేస్తే మేం మరో శ్లాబ్ వేస్తామన్న రీతిలో పోటాపోటీగా పని చేయటం విశేషం. అనుకున్న గడువు కంటే వారం.. రెండు వారాలకు ముందే తాత్కాలిక నిర్మాణాల్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ రెండు కంపెనీలు పని చేస్తున్నాయి. తాజాగా ఎల్ అండ్ టీ సంస్థ ఐదో నెంబరు భవనానికి శ్లాబ్ పని పూర్తి చేస్తే.. షాపూర్ జీ పల్లోంజీ సంస్త ఒకటో నెంబరు బిల్డింగ్ కి రెండో అంతస్తు పనులు ప్రారంభించటం గమనార్హం. ఈ రెండు సంస్థల మధ్య పని తీరు చూస్తే.. నువ్వో శ్లాబ్ పూర్తి చేసే లోపు.. నేను రెండో శ్లాబ్ పూర్తి చేస్తానన్నట్లుంది. ఇలాంటి ఆరోగ్యకర పోటీనే కదా ఏపీ రాజధాని నిర్మాణానికి కావాల్సింది..?
Tags:    

Similar News