బ్రిటన్‌కు కాబోయే ప్రధాని రిషి సునాక్‌ చుట్టూ ఉన్న వివాదాలివే!

Update: 2022-10-24 12:47 GMT
బ్రిటన్‌కు కొత్త ప్రధానమంత్రిగా రిషి సునాక్‌ దాదాపు ఖాయమైనట్టే. ప్రస్తుత ప్రధాని లిజ్‌ ట్రస్‌ ఆ పదవిని చేపట్టిన 45 రోజులకే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పోటీలో ఉంటానని ప్రకటించి.. తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిషి సునాక్‌ను సమర్థించే ఎంపీల సంఖ్య 142కు చేరింది. ప్రధానిగా పోటీలో ఉంటాలంటే కనీసం 100 మంది ఎంపీలు ఆ వ్యక్తి పేరును ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బలమైన ప్రత్యర్థులెవరూ పోటీలో లేకపోవడంతో రిషి సునాక్‌ ప్రధాని పదవిని చేపట్టడం దాదాపు ఖాయమైపోయింది.

కాగా రిషి సునాక్‌ గతంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. పలుమార్లు ప్రత్యర్థులు ఈ విషయాల్లో ఆయనను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా రిషి సునాక్‌ కంటే కూడా ఆయన భార్య, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షిత ప్రత్యర్థులకు లక్ష్యంగా మారారు.

కాగా రిషి సునాక్‌ సాధారణ ప్రజల కంటే కూడా ఆయనను ఉన్నత వర్గాలకు సన్నిహితుడని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. మనదేశంలో నరేంద్ర మోడీ కార్పొరేట్‌ వర్గాలకు మాత్రమే మేలు చేస్తాడని ప్రత్యర్థులు ఎలా విమర్శలు చేస్తుంటారో.. బ్రిటన్‌లోనూ రిషి సునాక్‌పై ప్రత్యర్థులు ఇలాగే విమర్శలు చేశారు.

ఈ మేరకు గతంలో బీబీసీ డాక్యుమెంటరీ.. ‘మిడిల్‌ క్లాస్‌: రైజ్‌ అండ్‌ స్ప్రోల్‌’లో రిషి సునాక్‌ చేసిన వ్యాఖ్యలను ప్రత్యర్థులు అస్త్రంగా మలుచుకున్నారు. ఆ డాక్యుమెంటరీలో రిషి సునాక్‌ తనకు రాచ కుటుంబీకులు, ఉన్నతవర్గాలవారే మిత్రులుగా ఉన్నారని వ్యాఖ్యానించారని అంటారు. వర్కింగ్‌ క్లాస్‌ (పనిచేసేవారు)లో తనకు మిత్రులు లేరని రిషి సునాక్‌ వ్యాఖ్యానించారని.. దీన్ని బట్టి ఆయన ప్రజల మనిషి కాదని ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు రిషి సునాక్‌ మాట్లాడిన క్లిప్‌ను వైరల్‌ కూడా చేశారు.

అలాగే రిషి సునాక్‌ సతీమణి అక్షితా మూర్తి నివాసం హోదాపైనా ప్రత్యర్థులు విమర్శలు సంధించారు. ఈ ఏడాది ఆమె 30 వేల పౌండ్లు చెల్లించి తన నాన్‌ డొమిసిల్‌ హోదాను ఏడాది పాటు పొడిగించుకున్నారు. అక్షిత యూకేలో పన్నులు ఎగ్గొట్టేందుకే ఈ హోదాను వాడుకొంటున్నారని ప్రత్యర్థులు తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రత్యర్థుల విమర్శలపై గతంలోనే అక్షిత సమాధానమిచ్చారు. తన పన్ను హోదా తన కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారకూడదని భావిస్తున్నట్టు తెలిపారు. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా లభించే ఆదాయంపై యూకేలో కూడా పన్ను చెల్లిస్తానని అక్షిత ప్రత్యర్థులకు ఘాటుగా బదులిచ్చారు.

ఇక ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తుండటంతో రష్యాపై బ్రిటన్‌ తీవ్ర ఆంక్షలు విధించింది. ఆ దేశాలకు చెందిన పెట్టుబడులను తమ దేశంలో స్తంభింపజేసింది.  ఈ మేరకు దేశ బ్యాంకుల్లో రష్యన్లు దాచుకున్న సొమ్మును, కంపెనీల్లో పెట్టుబడులను స్తంభింపజేసింది. అలాగే రష్యాలో పెట్రోలియం, షెల్‌ కంపెనీల్లో బ్రిటిషర్లు ఎవరూ పెట్టుబడులు పెట్టకుండా నియంత్రించింది.

అయితే రిషి సునాష్‌ సతీమణి అక్షితా మూర్తి మాత్రం ఇన్ఫోసిస్‌ సొమ్ముతో రష్యాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని విమర్శలు వచ్చాయి. రష్యాలో కార్యకలాపాలు నిలిపివేసేందుకు ఇన్ఫోసిస్‌ నిరాకరించింది. దీనిపై ఉక్రెయిన్‌ ఎంపీ లెసియా వాసిలెంకో  పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్‌ నుంచి అక్షితా మూర్తి సొమ్ము తీసుకునే అంశంపై మాట్లాడుతూ... ‘‘ఇది రక్తపు సొమ్ము.. రక్తపు వ్యాపారం ద్వారానే దీన్ని తీసుకున్నారనే వాస్తవంతో జీవించాల్సి ఉంటుంది’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News