కూల్ చహల్.. సిగ్నేచర్ స్టైల్ లో

Update: 2022-10-27 11:37 GMT
టీమిండియాలో అందరికంటే సన్నగా ఉండేదెవరు...? పోనీ అందరితో కలిసిపోయేదెవరు?.. అందరిలోనూ చలాకీగా కనిపించేదెవరు..? దీనికి సమాధానం స్పిన్నర్ యజువేంద్ర చాహల్. లెగ్
స్పిన్నర్ చాహల్ కు ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ రెండు మ్యాచ్ ల్లోనూ తుది జట్టులో అవకాశం రాలేదు.

సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, ఎడమ చేతి వాటం స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ పై జట్టు మేనేజ్ మెంట్ నమ్మకం ఉంచడంతో చాహల్ డగౌట్ కు పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో అతడు మైదానంలోని ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తూ కనిపిస్తున్నాడు.

జడేజా లోటు ఆ ఇద్దరితో.. అశ్విన్, అక్షర్ ఇద్దరూ బౌలింగ్ ఆల్ రౌండర్లు. లోయరార్డర్ లో పరుగులు సాధించగల నైపుణ్యం ఉన్నవారు. అందుకని టీమిండియా మేనేజ్ మెంట్ వారిపై నమ్మకం ఉంచి చాహల్ ను పక్కనపెట్టింది. అందులోనూ ఇటీవలి టోర్నీల్లో చాహల్ ప్రదర్శన గొప్పగా లేదు. అసలే బుమ్రా వంటి పేసర్ దూరం కావడంతో ఇబ్బందుల్లో ఉండగా, చాహల్ ఫామ్ పై నమ్మకం ఉంచి
ఆడించలేని పరిస్థితి. ఒకవేళ అతడు భారీగా పరుగులిస్తే మ్యాచ్ చేజారే ప్రమాదం ఉంది. అందుకనే జడేజా లోటును అక్షర్, అశ్విన్ తో టీమిండియా భర్తీ చేస్తోంది.

డ్రింక్స్ అందిస్తూ.. బక్క పల్చటి దేహంతో .. లాంగాఫ్ లాంగాన్ నుంచి బంతిని విసరగలడా? అనిపించేలా ఉండే చహల్.. మైదానంలో అదేమీ ఇబ్బందికరం కానట్లు చురుగ్గా కదులుతుంటాడు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లను ఇంటర్వ్యూలు కూడా చేస్తుంటాడు. కొంటె ప్రశ్నలతో ఆట పట్టిస్తుంటాడు. విదేశీ ఆటగాళ్లను కూడా ఇంటర్వ్యూలు చేస్తూ చహల్ చలాకీగా కనిపిస్తుంటాడు.  'చాహల్ టీవీ'అంటూ దీనికి పేరుండడం గమనార్హం. బీసీసీఐ సైతం అతడు చేసే ఇంటర్వ్యూలను ట్వీట్ చేస్తుంటుంది.

డగౌట్ లో సేదదీరుతూ నెదర్లాండ్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ లోనూ తుది జట్టులో చోటు దక్కని చాహల్ డగౌడ్ వద్ద సేద దీరుతూ కనిపించాడు. మైదానంలోని సహచరులకు డ్రింక్స్ అందించేందుకు సిద్ధంగా కనిపించిన అతడు.. నిశ్చింతగా ఉన్నాడు. కాలుపై కాలు వేసుకుని.. డ్రింక్స్ బాటిల్స్ పక్కన ప్రశాంతంగా కూర్చుని ఉండడంతో  ''ఇది చహల్ స్టైల్''అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తాయి.

కాగా, వచ్చే ఆదివారం టీమిండియా దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ కీలక మ్యాచ్ లో సఫారీలను కట్టడి చేయడానికి టీమిండియా స్పిన్ విభాగంలో ఏమైనా మార్పులు చేస్తే చహల్ కు చోటు దక్కొచ్చు. గతంలో అతడు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ను ఓ ఆటాడుకున్న నేపథ్యంలో తుది జట్టులో చోటు ఆశించవచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News