భారత్ లో కరోనా అల్‌ టైమ్ రికార్డ్ ... గత 24 గంటల్లో ఈ ఏడాదిలో అత్యధిక కేసులు

Update: 2021-04-07 05:30 GMT
ఇండియాలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడచిన 48 గంటల వ్యవధిలో యాక్టివ్ కేసుల సంఖ్య 7 లక్షల నుంచి 8 లక్షలకు పెరగడమే ఇందుకు నిదర్శనం. కరోనా మహమ్మారి ఇండియాలోకి ప్రవేశించిన తరువాత రెండు రోజుల వ్యవధిలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు పైగా పెరగడం ఇదే తొలిసారి. ఇప్పుడు రెండో వేవ్ ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో  మంగళవారం నాడు ఏకంగా 1,15,249 కొత్త కేసులు వచ్చాయి. ఇదే సమయంలో 630 మంది ప్రాణాలను కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య మంగళవారం 54 వేలకు పైగా పెరిగి, అత్యధిక ఒక రోజు రికార్డును నమోదు చేయగా, ఒక్క మహారాష్ట్రలోనే 55,469 కొత్త కేసులు వచ్చాయి. గత ఆదివారం దేశంలో 1,03,558 కేసులు నమోదు అయ్యాయి. మూడు రోజుల్లోనే రెండు సార్లు లక్ష కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే దేశంలో కరోనా వ్యాప్తి ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.

దీనితో కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి కూడా. ఇక యాక్టివ్ కేసుల విషయానికి వస్తే, కేవలం 24 రోజుల వ్యవధిలో 2 లక్షల నుంచి 8 లక్షలకు కేసులు పెరిగాయి. చాలా నగరాల్లోని ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో లేకపోవడంతో, ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం 30 శాతం బెడ్లను రిజర్వ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. కాగా, గత సంవత్సరం డిసెంబర్ తరువాత నిన్న 16 రాష్ట్రాల్లో అత్యధిక రోజువారీ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కరోనా వైరస్‌ నివారణలో భాగంగా వ్యాక్సినేషన్‌ పంపిణీ విషయంలో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 8.31 కోట్ల డోసులు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో 25 కోట్లపైగా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రపంచంలోనే భారతదేశం టాప్ లో నిలుస్తుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం కరోనా రెండో దశలో భాగంగా 8 రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యాపిస్తోందని వివరించింది. పెరుగుతున్న కరోనా కేసులతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర, ఛత్తీస్ ‌గఢ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్ ‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపింది.

తెలంగాణలో కొత్తగా 1914 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి చేరింది. తాజాగా ఐదుగురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1734కి చేరింది. తెలంగాణలో మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. కొత్తగా 285 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,03,298కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 95.78 శాతంగా ఉంది.  ప్రస్తుతం తెలంగాణలో 11,617 యాక్టివ్ కేసులున్నాయి. ఇవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 6,634 మంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ ఎంసి  పరిధిలో కొత్తగా 393 కేసులు వచ్చాయి. హైదరాబాద్‌లో కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 74,274 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 1,05,72,621కి చేరింది.
Tags:    

Similar News