'హైదరాబాద్' తో లింకు ఉన్న ప్రతి ఒక్కరు మిస్ కావొద్దు

Update: 2021-12-05 04:41 GMT
చాప కింద నీరులా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా? ఇప్పటికే ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న వేళ.. విదేశాల నుంచి వచ్చే వారి నుంచి అపాయం పొంచి ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే.. విదేశాల నుంచి మాత్రమే కాదు.. స్వదేశంలోని వారి కారణంగా కూడా కరోనా కేసులు పెరగటానికి అవకాశం ఉందన్న విషయాన్ని తెలిపే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ లో తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది. శివారులోని గండిపేట మండలం బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని ఒక టౌన్ షిప్ లో రెండు కుటుంబాలకు చెందిన పది మందికి తాజాగా కరోనా సోకిన వైనం బయటకు వచ్చింది.

గడిచిన కొన్ని నెలలుగా కరోనా కేసుల నమోదు తక్కువగా ఉండటం తెలిసిందే. అందుకు భిన్నంగా కొద్ది రోజుల నుంచి భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా తీవ్రత లేదని.. కేసుల నమోదు బాగా తగ్గిపోయిందని ప్రచారం జరుగుతున్న వేళ.. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న తాజా ఘటన కొత్త టెన్షన్ పెట్టేలా మారింది. ఈ ఖరీదైన టౌన్ షిప్ లో ఉండే వ్యక్తి ఒకరు ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చారు.

అనంతరం కరోనా లక్షణాలు కనిపించటంతో టెస్టు చేయించుకున్నారు. సదరు వ్యక్తికి పాజిటివ్ గా తేలింది. దీంతో.. ఇంట్లోని వారికి టెస్టులు చేయించగా.. నలుగురికి పాజిటివ్ గా తేలింది. ఇదిలా ఉంటే.. ఇదే బ్లాక్ లో ఉండే మరో కుటుంబంలోని నలుగురికి కూడా కరోనా పాజిటివ్ గా తేలటంతో కలకలం రేగింది. మొత్తంగా ఈ టౌన్ షిప్ కు సంబంధించి మొత్తం పది మంది కరోనా బారిన పడ్డట్లు చెబుతున్నారు.

హైదరాబాద్ మహానగరంలోని ఒక టౌన్ షిప్ లో ఇంత భారీగాఒకేసారి పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. మూడో వేవ్ మొదలైందన్న వార్తలు ఒకవైపు.. మరోవైపు గురుకులాల్లో ఇప్పటికే కరోనా కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. అందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ లో లింకు ఉన్న ప్రతి ఒక్కరు.. తమ వారు జాగ్రత్తగా ఉండాలన్న సూచన చేయాల్సిన అవసరం ఉంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు నెలల తర్వాత కరోనా కేసుల సంఖ్య తాజాగా పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. శనివారం 39,495 మందికి పరీక్షలు చేయగా 213 మందికి వైరస్ నిర్దారణ కావటం గమనార్హం. ఈ ఏడాది అక్టోబరు 5న ఒకే రోజున నమోదైన 218 కేసుల తర్వాత ఎక్కువగా నమోదైంది ఇప్పుడే. ఒకవైపు థర్డ్ వేవ్ ఆందోళన.. మరోవైపు ఒమిక్రాన్ ముప్పు ఉందన్న మాట వినిపిస్తున్నవేళ.. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అసన్నమైందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News