వీడియో: ముంబైలో కరోనా శవాలు..పక్కనే రోగులు

Update: 2020-05-07 12:10 GMT
ఈ వీడియో చూశాక మీరేదో ఇటలీలో తీసింది అనుకుంటే పొరబడ్డట్టే. అప్పట్లో ఇటలీలో కరోనా విలయం తాలుకూ వీడియోలు వైరల్ అయ్యాయి. వృద్ధులకు చికిత్స చేయకుండా చావుకు వదిలేయడం.. శవాల గుట్టల వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే తొలిసారి మన దేశంలో కూడా ఇలాంటి దారుణ స్థితి కళ్లకు కట్టింది. కరోనాతో ముంబైలో శవాలు పేరుకుపోయిన వైనం.. ఆ పక్కనే రోగులకు చికిత్స చేస్తున్న దారుణ దృశ్యాలు వైరల్ గా మారాయి.

భారత దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇందులో 70శాతం కేసులు ఒక్క ముంబై మహానగరంలోనే వెలుగుచూస్తున్నాయి. అక్కడ ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసులకు ముంబై ఆస్పత్రుల్లో, మార్చురీల్లో అసలు ఖాళీనే లేని వైనం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అమానవీయ సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.

ముంబైలోని నగర మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఓ ఆస్పత్రిలో దారుణం వెలుగుచూసింది. కరోనాతో మృతిచెందిన వారి డెడ్ బాడీల పక్క బెడ్లలో పైనే రోగులకు చికిత్స చేస్తున్న వైనం దిగ్బ్రాంతికి గురిచేసింది.మృతదేహాలను నల్లటి బ్యాగుల్లో చుట్టేసి ఉండగా.. ఆ పక్కనే ఇతర రోగులను , వారి బంధువులు పరామర్శిస్తున్నారు. వారికి శవాల పక్కనే చికిత్స చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని ఎవరో సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అందులో ఏడు కరోనా మృతదేహాలు బెడ్ లపైనే ఉంచి పక్కనే రోగులకు చికిత్స చేస్తున్న దారుణం కనిపించింది.

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే ఈ వీడియోను షేర్ చేసి ‘ఇంతకంటే అమానుషం ఎక్కడైనా ఉందా? షేమ్ ఫుల్’ అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత మిలింద్ దేవర షేర్ చేసి ఎందుకు కరోనా శవాలను తరలించలేదని ప్రశ్నించారు.

అయితే ఆ ఆస్పత్రిలో 15 శవాలను మాత్రమే భద్రపరిచే మార్చురీ ఉందని.. ఇప్పటికే 11 శవాలను ఉంచామని.. స్థలం లేకనే అలా బెడ్ లపై కరోనా శవాలను ఉంచామని ఆస్పత్రి డాక్టర్ ఇంగ్లే తెలిపారు. పకడ్బందీగా ప్యాక్ చేసిన డెడ్ బాడీలతో వైరస్ వ్యాపించదని డాక్టర్ తెలిపారు.


Full View
Tags:    

Similar News