లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఎన్నడూ లేనంతగా కుదేలైన పీఎంఐ !

Update: 2020-05-05 02:30 GMT
అత్యంత ప్రమాదకరమైన కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో భారత్ లో విధించిన లాక్ డౌన్ కొంతమేర సత్ఫలితాలను ఇస్తున్నా, దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం చూపుతోంది. భారత ఉత్పత్తి రంగం రికార్డు స్థాయి క్షీణత చవిచూస్తోంది. ఎన్నడూ లేనంతగా దేశీయ తయారీ రంగం పాతాళానికి పడిపోయింది. లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ ఆంక్షలు, అనేక సంస్థలు ఉద్యోగులను తగ్గించుకోవడం, రవాణా పరిమితులు వంటివి ఉత్పత్తి రంగాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పతనమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మార్చిలో 51.8గా ఉన్న పీఎంఐ, ఏప్రిల్ నెలలో 27.4కి పడిపోయింది. అంతేకాదు 15 సంవత్సరాల క్రితం ఐహెచ్ఎస్ మార్కిట్ డేటాను రికార్డ్ చేయడం ప్రారంభించినప్పటి నుండి భారత్‌ పీఎంఐ డాటా ఇంత స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. జనవరిలో ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 55.3 కంటే చాలా తక్కువ. వరుసగా 32 మాసాల పాటు అభివృద్ధి పథంలో నిలిచిన భారత ఉత్పత్తి రంగం కొన్నిరోజుల వ్యవధిలోనే కుచించుకు పోయిందని, కొత్త బిజినెస్ ఆర్డర్లు లేక కంపెనీలు డీలాపడిపోయాయని, గత రెండున్నరేళ్లలో ఈ తరహా పరిణామం ఇదే ప్రథమం అని తెలిపింది.

అయితే, లాక్‌ డౌన్ పరిమితులు సడలించిన తరువాత డిమాండ్ తిరిగి పుంజు కుంటుందనే ఆశా భావం వ్యక్తమవుతోంది. కాగా కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలైనాయి. ప్రస్తుతం మూడవ దశ లాక్ డౌన్ మే 17వ తేదీవరకు కొనసాగనుంది. అయితే ఇప్పటివరకు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు, వ్యాపార కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం కొన్ని ఆంక్షలతో కొన్ని సేవలకు అనుమతి ఇచ్చింది.
Tags:    

Similar News