కరోనా వైరస్ : 100 ఏళ్లలో అతిపెద్ద సంక్షోభం ..నష్టం ఎన్ని వందల కోట్లంటే ?

Update: 2020-03-16 16:30 GMT
కరోనా వైరస్ ... ఈ పేరు చెబితే ప్రస్తుతం ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ మహమ్మారి బారిన పడని దేశాలు చాలా తక్కువనే చెప్పాలి. 140 కు పైగా దేశాలకు విస్తరించి రోజుకు వందల్లో ప్రజల ప్రాణాలను తీస్తుంది. ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తలచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. చైనా లో మొదలైన ఈ వైరస్ అమెరికా వరకు విస్తరించి అగ్ర రాజ్యాన్ని కూడా భయపెడుతోంది. చైనా లో బయటపడిన ఈ వైరస్ చైనా... ఇటు ప్రపంచం కరోనా గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు కరోనా వైరస్ ను కేవలం ఆరోగ్య అత్యవసర పరిస్థితి గానే కాకుండా ఆర్థిక అత్యవసర పరిస్థితిగా కూడా గుర్తిస్తున్నాయి.

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర స్థాయిలో దెబ్బతినబోతోంది. గత 100 ఏళ్లలో ఎన్నడూ చూడనంత తీవ్ర స్థాయిలో నష్టం ఉండబోతోందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. తొలుత కరోనా కేవలం ఒక్క చైనా కు మాత్రమే పరిమితం అవుతుందని అనుకున్నారు. కానీ , ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రపంచమంతా పాకింది. ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు వాటిల్లిన నష్టం సుమారుగా 10 లక్షల కోట్ల డాలర్ల మేరకు ఉంటుంది. మన కరెన్సీ లో చెప్పాలంటే 750 లక్షల కోట్లు.

ఇకపోతే, 1918 లో ప్రపంచాన్ని ఒక వైరస్ ఇలాగే భయపెట్టిందంట. ముఖ్యంగా మన భారత దేశాన్ని పట్టి పీడించిందట. దాని ధాటికి ఒక్క ఇండియాలోనే లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు ఒక విషయం వెలుగులోకి వస్తోంది. కానీ 100 ఏళ్ళ క్రితం మెడిసిన్ ఇంతలా అందుబాటులో లేదు కాబట్టి మరణాల రేటు ఎక్కువగా ఉండచ్చు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా అప్పుడు సుమారు 5 కోట్ల మంది చనిపోయారు. అది రెండు ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన సైనికుల కంటే చాలా అధికం. ఇప్పుడు వైద్య రంగం ఇంతలా అభివృద్ధి చెందినా... టెక్నాలజీ ఎంతలా అందుబాటులోకి వచ్చినా కూడా కరోనా వైరస్ కి ఇప్పటి వరకు మందు కనిపెట్టలేదు.

చైనా కు పక్కనే ఉండి, జనాభా లో 100 కోట్లకు దాటి ఉన్న అతి పెద్ద దేశం భారత్. చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం కాబట్టి కరోనాను బయటకు పొక్కనీయకుండా చూసుకోగలిగింది. కానీ భారత్ లో పరిస్థితులు వేరు. మనది ప్రజాస్వామ్య దేశం. ఏదైనా పారదర్శకంగా జరగాల్సిందే. కాబట్టి మనం నిజాలను కప్పి పుచ్చలేం. కానీ, అదృష్టమో, లేదా మన దేశ భౌగోళిక, ఉష్ణోగ్రత వల్లనో కానీ ఇండియా పై కరోనా వైరస్ ప్రభావం ప్రత్యక్షంగా తక్కువేనని చెప్పాలి. ఇప్పటి వరకు మన దేశంలో కేవలం 100 లోపు అనుమానిత కేసులు నమోదైతే కేవలం రెండు మరణాలు మాత్రమే నమోదయ్యాయి. అయితే, మనం ఉదాసీనంగా ఉంటే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కేవలం ఎండ మాత్రమే కరోనా వైరస్ నుండి మనల్ని కాపాడలేడు అని గుర్తించాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News