ఏపీ రాజకీయాలకు 'కరోనా' గండం...

Update: 2022-12-23 08:38 GMT
కాలం కలిసొస్తే నడిచొచ్చేకొడుకు పుడతాడని అంటారు.. మరి అదే కాలం ఎదురు తిరిగితే ఎదుర్కునే శక్తి మానవ మాత్రులకు ఉండదని కరోనా తేల్చి చెప్పింది.. మరిప్పుడు ఈ కరోనా మరోసారి రాజకీయాలకు గండం కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరో ఏడాదిన్నరలో ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉంది. మరిప్పుడు చైనాకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్ 7 భారత్ లోకి ఇప్పటికే ఎంటరైంది. ఏపీతో పాటు భారత రాజకీయాలను ఈ వేరియంట్ ఎటువైపునకు తీసుకెళ్తుందో అనే కలవరం అందరిలోనూ మొదలైంది...

-అస్త్రాలకు పదును..

ఏపీలో రాజకీయ వేడి మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే ముందస్తు ఎన్నికలు వస్తాయేమోనని ఎవరికివారు తమ అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. త్వరలో ర్యాలీని ప్రారంభిస్తానని ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. యాత్ర ఎప్పటి నుంచి అనేది కన్ఫామ్ చేయనప్పటికీ పక్కా అనేది వాస్తవం.. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన యాత్రకు అస్త్రాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు.. వారాహి వాహన రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చేసుకుని యాత్రకు సిద్ధమైపోయారు. అధికార పార్టీ కూడా గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. ఎవరైనా జగన్ సూచనలు పాటించకపోతే పిలిచి మరీ తలంటుతున్నారు. దీంతో హడావుడిగా అంతా 100 రోజులకు పైగా యాత్రలు పుర్తి చేసుకుని విజయోత్సవాలు సైతం జరుపుకుంటున్నారు.

-పొంచి ఉన్న ఒమిక్రాన్ గండం..

ఏపీ వ్యాప్తంగా ఎవరికి వారు విస్తృతంగా ప్రచారం నిర్వహించుకుంటూ రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోని రాజకీయ నాయకులకి మరో గండం పొంచి ఉంది. ఇప్పటికే చైనాలో విజృంభిస్తున్న ఓమిక్రాన్ బిఎఫ్ 7 అనే కొత్త వేరియంట్.. ఉరుములేని పిడుగులా వచ్చి పడింది. ఇదే ఇప్పుడు రాజకీయ నాయకుల్ని కలవరపెడుతోంది. రాజకీయ ప్రచారానికి సర్వం సిద్ధమవుతున్న వేళ ఇదెక్కడి గోలరాబాబు అంటూ అంతా తలలు పట్టుకుంటున్నారు.

-ఏం జరుగుతుందో?

ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తన వివరణ ఇచ్చింది. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ప్రజల్లో సైతం బీఎఫ్ 7 టాక్ తీవ్రంగా నడుస్తోంది. జనంలో భయంలేనప్పటికీ మాస్క్ ధరించి జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం అంటే ఒక విధంగా సామాన్యుల నెత్తిన పిడుగుగానే చెప్పవచ్చు. జనాలు ఒకచోటకు చేరకూడదని నిబంధన త్వరలో వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోని రాజకీయ నాయకులు తమ ప్రచారానికి సిద్ధమవుతున్న వేళ కరోనా విస్తరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఎత్తుగడలు ఎంత వరకు సద్వినియోగం అవుతాయనేదే ప్రధాన ప్రశ్న.. ఒమిక్రాన్ నూతన వేరియంట్ విజృంభిస్తున్న వేళ ఎన్నికల సరళి ఎలా ఉంటుందనేది ఊహకు అందడం లేదు. ఒకవేళ కరోనా నిబంధనలు అమల్లోకి వస్తే పరిస్థితి ఏమిటనేదానిపై విశ్లేషణలు విస్తృతంగా జారుతున్నాయి.

-అస్త్రాలకు పదును పెట్టండి..

చాపకింద నీరులా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వ్వాపిస్తే అది తన తీవ్రరూపాన్ని ప్రదర్శించడానికి ఎంతలేదన్నా మూడు నెలల సమయం పడుతుంది. అంటే మార్చి నాటికి ఒమిక్రాన్ బీఎఫ్ 7 తన వికృత క్రీడను ప్రారంభించే అవకాశం ఉంది. అదే సమయంలో ఎన్నికల ప్రచార సరళికి శ్రీకారం చుడదామనుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనలు అమలయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే రాజకీయాలు ఎలా ఉంటాయనేది చర్చ తీవ్రంగా నడుస్తోంది. అధికార పార్టీ మాత్రం తన అధికారగణాన్ని వినియోగించి పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు ఉన్నాయి. విపక్షాలపై కోవిడ్ నిబంధనల పేరుతో కట్టడి చేసే అవకాశాలు లేకపోలేదు. అందుకే విపక్షాలు తమ అస్త్రాలకు మరింత పదునుపెట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కార్యదీక్షలోకి దిగడమే మేలని అనిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News