చైనా లో 'క‌రోనా'...ఏపీలో 'లంపీ స్కిన్'

Update: 2020-02-01 10:19 GMT
`కరోనా` వైరస్ పేరు వింటేనే ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. త‌మ దేశ ప్ర‌జ‌లు ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఆయా దేశాల ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. ఓ వైపు ప్ర‌పంచ దేశాల‌ను కరోనా వైరస్ గ‌డ‌ గ‌డ‌లాడిస్తోంటే...తాజాగా మరో వైర‌స్ ఏపీని అత‌లాకుత‌లం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో పుట్టిన కొత్త వైరస్ ‘లంపీ స్కిన్’ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రైతుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక్క తూర్పు గోదావ‌రి జిల్లాలోని 1000కి పైగా ఆవులకు ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. వాటిలో 20 ఆవులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఉత్తరాది నుంచి కోనసీమకు ‘లంపీ స్కిన్’ వ్యాపించి ఉంటుంద‌ని వెటర్నరీ డాక్టర్లు అభిప్రాయ‌ ప‌డుతున్నారు.

‘లంపీ స్కిన్’ బారిన ప‌డ‌కుండా మిగ‌తా జిల్లాల‌లోని  ప‌శు వైద్యాధికారులు అప్ర‌మ‌త్తమ‌య్యారు. `నీథ్‌లింగ్` అని కూడా పిలిచే ఈ వైర‌స్ బారిన ప‌డ్డ ప‌శువుల్లో పాల ఉత్ప‌త్తి గ‌ణ‌నీయంగా ప‌డిపోతుంద‌ని ప‌శువైద్యులు చెబుతున్నారు. దీంతోపాటు ఆవులు, గేదెల్లో ఎదుగుద‌ల మంద‌కొడిగా ఉండ‌డం, పున‌రుత్ప‌త్తికి సంబంధించిన స‌మస్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ని అంటున్నారు. ప‌శువుల ర‌క్తంలో ఈ వైర‌స్‌ను గుర్తించ‌డానికి 21 రోజులు ప‌డుతుంద‌ని చెబుతున్నారు. అయితే, ఈ వైర‌స్ మ‌నుషుల‌కు సోకే అవ‌కాశం లేద‌ని, కేవ‌లం ప‌శువుల్లో మాత్ర‌మే వ్యాప్తి చెందుతుంద‌ని చెప్ప‌డం తో ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Tags:    

Similar News