ఊరెళ్లిపోతున్న‌రు బ‌తికుంటే బ‌లుసాకు తిందామ‌ని!

Update: 2021-04-03 15:30 GMT
'81,466 కరోనా కేసులు..' సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ఏప్రిల్ ఒక‌టో తేదీన దేశంలో న‌మోదైన కేసుల సంఖ్య ఇది. తొలిద‌శ‌లో ఈ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డానికి నాలుగైదు నెల‌లు ప‌డితే.. సెకండ్ వేవ్ లో కేవ‌లం రెండో నెల‌లోనే ఇంత భారీగా కేసులు న‌మోద‌వ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగించే అంశం. దీంతో.. అటు ప్ర‌భుత్వాల‌తోపాటు ఇటు ప్ర‌జ‌లు కూడా తీవ్ర‌భ‌యాందోళ‌నకు గుర‌వుతున్నారు.

దీంతో.. లాక్ డౌన్ తొలినాళ్ల నాటి పరిస్థితులు క‌నిపిస్తున్నాయి. అప్పుడు ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధిస్తుంద‌ని మెజారిటీ ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. తిండీ తిప్ప‌లు లేకుండా.. రోడ్ల‌పై మైళ్ల దూరం న‌డ‌వాల్సి వ‌స్తుంద‌ని, కొంద‌రు ఆక‌లి చావులు చావాల్సి వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. కానీ.. ఆ దారుణాల‌న్నీ దేశం చ‌విచూసింది. జ‌నం అనుభ‌వించారు. అయితే.. మ‌రోసారి అత్యంత వేగంగా కేసులు పెరుగుతుండ‌డంతో జ‌నం ముందుగానే మేల్కొంటున్నారు.

'ఆద‌రించ‌మ‌ని చాచిన దోసిట అక్ష‌య పాత్రే హైద‌రాబాదు' అన్నాడో కవి. అవును.. ఇది ముమ్మాటికీ నిజ‌మే. స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యం ఉన్న‌వారు మొద‌లు.. జీవితానికి దారీతెన్నూ తెలియ‌నివారు కూడా చూసేది భాగ్య‌న‌గ‌రం దిక్కే! అందుకే.. విద్యార్థి మొద‌లు లేబ‌ర్ కార్మికుడి దాకా.. ఉద్యోగ‌స్తుడి నుంచి క‌ర్ష‌కుడి దాకా చాలా మంది హైద‌రాబాద్ నీడ‌నే పొట్ట‌పోసుకుంటారు. అలాంటి వారంద‌రూ గ‌త లాక్ డౌన్ తో చెట్టుకొకరు.. పుట్ట‌కొక‌రు అన్న‌ట్టుగా చెల్లాచెదురైపోయారు.

అక్టోబ‌రు నుంచి క‌రోనా తీవ్ర‌త‌ కాస్త త‌గ్గిన‌ట్టు క‌నిపించ‌డంతో.. మ‌ళ్లీ హైద‌రాబాద్ బాట ప‌ట్టారు. ఎవ‌రి ప‌నుల్లో వారు మునిగిపోయారు. కానీ.. అది మూణ్నెల్ల ముచ్చ‌ట మాత్ర‌మే అయ్యింది. కొవిడ్ మ‌హమ్మారి సెకండ్ వేవ్ ధాటికి మ‌రోసారి ఇంటిబాట ప‌డుతున్నారు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్వ‌స్థలాల‌కు వెళ్లిపోతున్నారు. దీనికి క‌రోనా భ‌యం ఒక‌టైతే.. లాక్ డౌన్ విధించే అవ‌కాశాన్ని కూడా కొట్టిపారేయ‌లేమ‌నే భావ‌న‌ చాలా మందిలో ఉంది.

సొంత ఊరిలో క‌లో గంజో తాగుతూ బ‌తుకుదామ‌ని హైద‌రాబాద్ ను ఖాళీ చేసి పోతున్నారు. ఖచ్చితంగా ఉండాల్సిన వారు మినహా.. వెళ్లడానికి అవకాశం ఉన్న వారంతా.. అన్నీ సర్దుకొని ఊరెళ్లి పోతున్నారు. దీంతో.. హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతోంది. ఏ బజారు చూసినా.. గేట్లకు టూలెట్ బోర్డులు వేళాడుతున్నాయి. గతంలో.. హైదరాబాద్ లో మంచి ఇల్లు, తక్కువ ధరలో దొరకాలంటే ఎంతో కష్టంగా ఉండేది. కానీ.. ఇప్పుడు అందరూ వెళ్లిపోతుండడంతో.. ఎక్కడ చూసినా అద్దె గదులు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. రెంట్లు కూడా గతం కన్నా తగ్గిపోయాయి.

గతంలో నాలుగైదు వేలు పలికే సింగిల్ రూమ్ ఇప్పుడు రెండున్నర వేలకే లభిస్తోందని సమాచారం. సింగిల్ బెడ్ రూమ్ రెండు వేల చొప్పున.. డబుల్ బెడ్ రూమ్ మూడ్నలుగు వేల చొప్పున రెంట్లు తగ్గాయని తెలుస్తోంది. ఈ విధంగా అటు జనానికి ఉపాధి దూరం చేసిన కరోనా.. ఇటు ఇంటి ఓనర్లకు రెంట్ కూడా దూరం చేసిందని అంటున్నారు. మున్ముందు ఈ మహమ్మారి ఇంకెలా పరిస్థితులు కల్పిస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News