కరోనా మాత్రలు .. ఒక్కరోజులోనే క‌రోనా అంతం !

Update: 2021-04-21 12:30 GMT
చైనా లో వెలుగులోకి వచ్చిన కరోనా ఆ తర్వాత క్ర‌మంగా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది.. కాలం గ‌డిచే కొద్ది కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్ర‌జ‌ల‌నుఆందోళనకి గురిచేస్తున్నాయి. ఫ‌స్ట్ వేవ్ ఒక ర‌క‌రంగా ఉంటే.. ఇప్పుడు సెకండ్ వేవ్ మరింత అలజడికి గురిచేస్తుంది. ఈ త‌రుణంలో వ్యాక్సిన్ల గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల టీకాలు అందుబాటులోకి వ‌చ్చాయి. కరోనా మహమ్మారి సోకిన వారికి ఇప్పటివరకు ఇతర వ్యాధుల్లో ఉపయోగించే రెమ్ డెసివిర్, పావిపిరావిర్ వంటి శక్తిమంతమైన ఔషధాలు వాడుతున్నారు. ప్రత్యేకించి కరోనా కోసం ఎలాంటి ఔషధాలు లేవు. అయితే మెర్క్, రిడ్జ్ బ్యాక్ ఫార్మా సంస్థలు కేవలం కరోనా కోసమే ఓ ఔషధాన్ని అభివృద్ధి చేశాయి. దీని పేరు మోల్నుపిరావిర్. ఇది మాత్రల రూపంలో ఉంటుంది. కరోనా రోగులపై మోల్నుపిరావిర్ మాత్రలను 5 రోజుల పాటు పరీక్షించి చూడగా, వారిలో వైరస్ కణాల సంఖ్య బాగా తగ్గిపోయినట్టు గుర్తించారు. మోల్నుపిరావిర్ అనే యాంటీవైరల్ ఔషధం.

శ్వాసకోశ వ్యవస్థలో ఇన్ ఫెక్షన్లు కలిగించే ఆర్ ఎన్ ఏ వైరస్ లపై మోల్నుపిరావిర్ సమర్థంగా పనిచేస్తుందని రుజువు చేశారు. ఇన్ ఫెక్షన్ సోకిన జంతువులకు నోటి ద్వారా ఈ ఔషధాన్ని ఇచ్చినప్పుడు వాటి నుంచి బయటకు వెలువడే వైరల్ రేణువులు గణనీయంగా తగ్గుతాయని ప్ర‌యోగాల్లో తేల్చారు. దీంతో వైర‌స్ వ్యాప్తి త‌గ్గుతుందంటున్నారు. మోల్నుపిరావిర్ ను కొవిడ్ కట్టడికి అనువైన మందుగా గుర్తించారు. ఇది నోటి ద్వారా తీసుకునే మందు. కరోనా వ్యాప్తిని వేగంగా అడ్డుకునే సామర్థ్యమున్న ఔషధాన్ని గుర్తించటం ఇదే మొద‌టిసారి కావ‌డం మ‌రో విశేషం. కోవిడ్ చికిత్స‌లో ఇది మూడు రెట్లు ప్రయోజనంగా ఉంటుందంటున్నారు. కరోనా పై  ఈ ఔషధ సమర్థతను నిర్ధరించేందుకు ఫెర్రెట్ అనే జంతువులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. వాటికి కరోనా వైరస్ తో ఇన్ ఫెక్షన్ కలిగించారు. వాటి ముక్కు ద్వారా వైరస్ రేణువులు బయటకు వస్తున్న దశలో కొన్ని జంతువులకు మోల్నుపిరావిర్ ఇచ్చారు.

మిగతా వాటికి ఈ ఔషధాన్ని ఇవ్వలేదు. వాటిని వేర్వేరు బోనుల్లో ఉంచారు. ఆ తర్వాత ఈ రెండు బోనుల్లోకి ఆరోగ్యంగా ఉన్న ఫెర్రెట్లను ప్రవేశపెట్టారు. ఇక‌, మోల్నుపిరావిర్ ఔషధాన్ని పొందిన జంతువులున్న బోనులోకి వెళ్లిన ఫెర్రెట్లకు వైరస్ సోకలేదు. ఈ మందును పొందని జీవులున్న బోనులోని ఫెర్రెట్లకు మాత్రం ఈ మహమ్మారి సోకింది. ఈ లెక్కన ఒక కరోనా బాధితుడికి మోల్నుపిరావిర్ ఇస్తే.. 24 గంటల్లోనే అతడి నుంచి వైరస్ వ్యాప్తి ఆగిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప‌రిశోధ‌న‌ను మొత్తం నేచర్ మైక్రోబయాలజీ పత్రికలో ప్ర‌చురించారు.. జార్జియా స్టేట్ యూనివర్శిటీ  పరిశోధనా బృందం మొదట ఈ మందు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని తేల్చారు.
Tags:    

Similar News