వణికించే ఈ అంచనా ఎంత నిజం? తెలంగాణలో అంతమంది పిల్లలకు కరోనా?

Update: 2021-06-04 03:30 GMT
మొదటి వేవ్ ను చూశాం. రెండో వేవ్  వేవ్ ఎంతలా వణికించిందో అందరూ స్వయంగా అనుభవించాం. మరో మూడు.. నాలుగు నెలల్లో థర్డ్ వేవ్ వస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రెండో వేవ్ పూర్తిగా కాక ముందే మూడో వేవ్ గురించిన అంచనాలు మొదలు కావటం.. దాని తీవ్రతపై కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అంతర్జాతీయ నిపుణుల హెచ్చరికలు ఒకవైపు.. జాతీయస్థాయిలో కొందరు ప్రముఖుల విన్నపాల వేళ.. కొన్ని మీడియా సంస్థలు చెలరేగిపోయి రాస్తున్న వార్తలు ప్రజల్లో కొత్త భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

థర్డ్ వేవ్ మీద తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ వేసిన అంచనా వణుకు తెప్పించేలా ఉంది. దానికి శాస్త్రీయ ఆధారం లేకపోయినా.. వారు వేసిన లెక్కల్ని చూసినప్పుడు అమ్మో.. ఇంత భారీగానా? మన పిల్లల పరిస్థితి ఏమిటన్న దిగులుతో తల్లడిల్లే పరిస్థితి నెలకొంది. థర్డ్ వేవ్ లో చిన్నారులు ఎక్కువగా ఎఫెక్టు అవుతారన్న వార్తల నేపథ్యంలో  ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 30 లక్షల మంది చిన్నారులకు వైరస్ సోకుతుందన్న లెక్కను వేయటం కంగారు పుట్టించేలా ఉంది.

ఈ లెక్క దారి తప్పిందా? అన్న సందేహం కలిగేలాఉంది. ఎందుకంటే.. మూడో వేవ్ మూడు నెలల పాటు ఉంటుందన్న అంచనాల్నిఇప్పటికే విన్నాం. ఆ మాటకు వస్తే.. మూడు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే మూడో వేవ్ ముగుస్తుందని చెబుతున్నారు. మొదటి.. రెండో దశల్ని చూస్తే.. తెలంగాణలో ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజుకు ఆరు వేల కంటే తక్కువ కేసులే నమోదయ్యాయి. వాస్తవ లెక్కలకు.. ప్రభుత్వం చెప్పే దానికి పొంతనే లేదని అనుకుందాం. గరిష్ఠంగా రోజుకు 12 వేల మంది పాజిటివ్ బారిన పడ్డారనే అనుకుందాం. ఇలాంటి పరిస్థితి మహా అయితే పదిహేను రోజులు కూడా ఉండదు. అంటే.. 12 వేల మంది పదిహేను రోజులు అంటే.. 1.8లక్షల మంది. మిగిలిన రోజుల్లో సరాసరి అనధికారికంగా 5వేల మంది చొప్పున అనుకుందాం. నిజానికి ఇది కూడా చాలా ఎక్కువే. కానీ.. అంచనా కాబట్టి కాస్త ఎక్కువే అనుకుందాం. ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండేందుకు అలా లెక్క వేసుకుందామనే అనుకుందాం.

అలా అనుకున్నప్పుడు థర్డ్ వేవ్ మొత్తం 90 రోజులకు తీవ్రత ఎక్కువగా ఉండే 15 రోజులు తీసేస్తే నికరంగా మిగిలేది 75 రోజులు. ఆ 75రోజుల్లోనూ రోజుకు 5 వేల కేసులు నమోదవుతాయని అనుకుందాం. ఇవన్నీ కేవలం చిన్న పిల్లలే అనుకుందాం. అలా చూసినా 3.75 లక్షల మంది పిల్లలే అవుతారు. తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు 1.8లక్షలు.. తర్వాత 3.75 లక్షలు.. కలిపితే 5.55లక్షలు మాత్రమే. మరో లక్ష అదనంగా అనుకున్నా ఆరున్నర లక్ష. కానీ.. 30 లక్షల మంది చిన్నారులు అని చెప్పటం భయానికి గురి చేయటమే తప్పించి మరింకేమీ కాదన్నది మర్చిపోకూడదు.

థర్డ్ వేవ్ చిన్నారులకు ముప్పు మాట నిజమే. అలా అని వణికిపోవద్దు. జాగ్రత్తలు తీసుకోవటం.. అప్రమత్తంగా ఉండటం ద్వారా చిన్నారుల్ని కరోనా బారిన పడకుండా చూసుకునే అవకాశం ఉందన్నది మర్చిపోవద్దు. ఆందోళన చెంది సాధించేది ఏమీ లేదు.. విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడటం ద్వారా ఎవరి పిల్లల్ని వారు సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి అంచనాలకు అనవసరంగా ఆగమాగం కావొద్దు.
Tags:    

Similar News