ప్రపంచానికి మళ్లీ కరోనా ముప్పు

Update: 2022-03-16 10:49 GMT
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ మరోసారి ఆ మహమ్మారి విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని.. స్వల్ప విరామం తర్వాత వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య  సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) వెల్లడించింది. ముఖ్యంగా కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ తిరగబడుతోందని హెచ్చరించింది.

తాజాగా చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూ.హెచ్.ఓ  ఎపిడెమిలాజిస్ట్ మరియా వాన్ ఖెర్ఖోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'కోవిడ్ 19 అంతమవుతుందా? లేదా మరింత ఉధృతంగా ఉండబోతోందా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని.. వీటికి సమాధానాలు వెతికే ముందు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దామని తెలిపారు.

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇంకా తీవ్రస్తాయిలో ఉందని.. ఇటీవల కొన్ని వారాల పాటు తగ్గుముఖం పట్టిన కేసులు తాజాగా మళ్లీ పెరుగుతున్నాయన్నారు. పరీక్షల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ కేసులు పెరుగుతున్నాయని ఎపిడెమిలాజిస్ట్ తెలిపారు.

మార్చి 7-13 మధ్య ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు 8శాతం పెరిగాయి. అత్యధికంగా దక్షిణ కొరియా, వియత్నాం, జర్మనీ దేశాల్లో ఈ కేసులు పెరుగుదల కనిపిస్తోందన్నారు.

వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉందని చెప్పి కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు ఎత్తివేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.  వ్యాక్సిన్ల వల్ల వ్యాధి తీవ్రత, ప్రాణాపాయ ముప్పు తగ్గుతుందే తప్ప,  వైరస్ వ్యాప్తి తగ్గబోదని తెలిపారు.

దేశాలను బట్టి కరోనా వైరస్ మారుతోందని.. వైరస్ వ్యాప్తి తగ్గబోదని ఆమె అన్నారు.దీనిపై ప్రపంచమంతా అప్రమత్తంగా ఉండాలని వివరించారు. చైనాలో గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. దీంతోనే లాక్ డౌన్ విధించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆ వైరస్ విజృంభించకుండా ఈ చర్యలు చేపట్టాలని డబ్ల్యూ.హెచ్.ఓ పేర్కొంది.
Tags:    

Similar News