పర్యావరణానికి మేలు చేస్తోన్న కరోనా వైరస్ ..ఎలా అంటే ?

Update: 2020-03-20 05:13 GMT
ప్రపంచంపై పంజా విసురుతోన్న కరోనా వైరస్‌ ధాటికి దేశాలన్నీ భయం తో వణికిపోతున్నాయి. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, యుద్దాలు, ప్రయాణాలు, పాలిటిక్స్ అన్నీ పక్కకుపోయాయి. అన్ని దేశాల ఫోకస్ అంతా ఇప్పుడు కరోనా వైరస్‌ నియంత్రణ పైనే. వైరస్ నుంచి తమ ప్రజలను కాపాడుకునేందుకు అన్ని దేశాలు శాయాశక్తుల ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించగా.. మరికొన్ని దేశాలు అదే బాటలో పయనించే అవకాశం ఉంది. లాక్ డౌన్ కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. వైరస్ నియంత్రణకు ఇంతకు మించిన మార్గమేమీ కనిపించడం లేదు.

అయితే ఇక్కడే ఓ ఆసక్తికర విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. వైరస్ ధాటికి ఓవైపు మానవాళి విలవిల్లాడుతుంటే.. అదే వైరస్ పరోక్షంగా ప్రకృతికి,భూమికి మేలు చేస్తోంది. కరోనా కూడా భూమి కి మేలు చేస్తుందా అదెలా అని అనుకుంటున్నారా?కరోనా వైరస్ పుట్టుకొచ్చిన చైనాలోని హుబెయ్ ప్రావిన్స్‌ లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సర్వం మూతపడ్డాయి. విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, పరిశ్రమలు అన్నీ మూతపడటం తో రోడ్ల పైకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అలాగే పరిశ్రమల నుంచి వదులుతున్న ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో గతేడాది పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 21.5శాతం పెరగడం గమనార్హం.

ఒక్క హుబెయ్ ప్రావిన్స్‌ లోనే కాదు చైనా వ్యాప్తంగా వాయు కాలుష్యం గణనీయంగా తగ్గినట్టు నాసా విడుదల చేసిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. గాలిలో నైట్రోజన్ డైఆక్సైడ్ ఉద్గారాలు చాలావరకు తగ్గిపోయాయని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. పవర్ ప్లాంట్స్,ఇతరత్రా పరిశ్రమలపై ఎప్పుడూ ఆవరించి ఉండే విషపూరిత టాక్సిక్ గ్యాస్ అసలు కనిపించకుండా పోయిందని వెల్లడించింది. అలాగే గాలిలో కార్పన్ డైఆక్సైడ్(CO2) శాతం కూడా గణనీయంగా తగ్గినట్టు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 1 వరకు చైనా ఎయిర్‌లో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు 25శాతం మేర తగ్గినట్టు తెలిపింది. వాస్తవానికి ప్రపంచ వాయు కాలుష్యంలో అతి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తున్నది చైనానే.

ఏడాదికి దాదాపు 30శాతం కార్బన్ ఢైఆక్సైడ్ ఉద్గారాలను చైనా విడుదల చేస్తోంది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా చైనా తీసుకున్న చర్యలే వాయు కాలుష్యం తగ్గడానికి కారణమని చెబుతున్నారు. ఆయిల్,స్టీల్ ప్రొడక్షన్ గణనీయంగా తగ్గిపోవడం,దేశీయ విమానాలను తగ్గించడం,అలాగే బొగ్గు వినియోగం తగ్గడం వంటివి వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టడానికి కారణాలుగా చెబుతున్నారు.తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో.. ఈ ఏడాది ఫిబ్రవరి 3 నుంచి మార్చి 1వ తేదీ వరకు చైనాలో బొగ్గు వినియోగం 36శాతం మేర తగ్గింది. వైరస్ వ్యాప్తిని నివారించడానికి తీసుకున్న లాక్ డౌన్ చర్యల కారణంగా చైనా కాలుష్య స్థాయిలో క్షణికమైన తగ్గదల నమోదైందని.. కానీ ఒక్కసారి ఆ దేశం ఆర్థిక వ్యవస్థపై తిరిగి రీబూట్ చేయడం మొదలుపెడితే.. గతంలో కంటే ఎక్కువ విషపూరిత వాయువులు గాల్లోకి విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతానికైతే ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టింది.
Tags:    

Similar News