ఆ రెండు జిల్లాలతో ఏపీ ప్రజలకు కొత్త వణుకు

Update: 2020-04-14 03:00 GMT
ఏపీ ప్రజలకు కొత్త వణుకును తెప్పిస్తున్నాయి రెండు జిల్లాలు. కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న వేళ.. రెండు జిల్లాల్లో పెరుగుతున్న కేసుల లెక్క పరిస్థితిని ఇబ్బంది కరంగా మార్చేస్తున్నాయి. సోమవారం రాత్రి నాటికి ఏపీలో కరోనా కేసులు 439కు చేరాయి. ఇందులో సగానికి పైగా కేసులు మూడు జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. అత్యధిక కేసులు గుంటూరు జిల్లాలో నమోదైతే.. తర్వాతి స్థానం లో కర్నూలు జిల్లాలో నమోదవుతున్నాయి. తర్వాతి స్థానంలో నెల్లూరు జిల్లా నిలిచింది.

గుంటూరులో మొత్తం 93 కేసులు నమోదై.. ఏపీలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా మారింది. దీంతో.. ఈ జిల్లాకు ఇరుగుపొరుగున ఉండే ప్రకాశం.. క్రిష్ణా జిల్లాలకు తలనొప్పిగా మారింది. ప్రకాశం లో ఇప్పటి వరకూ 41 కేసులు నమోదైతే.. క్రిష్ణా జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కరోనాకారణంగా ఏడుగురు మరణించారు. పెరుగుతున్న కేసుల్లో అత్యధికం రెండు జిల్లాల్లోనే ఉండటంతో.. వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని ఏపీ సర్కారు గుర్తించింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏపీలో కేసుల తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ విజయనగరం.. శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఒక్కటంటే ఒక్క కేసు నమోదు కాకపోవటం గమనార్హం. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పదకొండు జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఉత్తరాంధ్రలోని ఈ రెండు జిల్లాల్లో మాత్రం కేసులు నమోదు కాకపోవటం విశేషంగా చెప్పాలి.

ఇక.. కేసులు అత్యధికంగా నిలిచిన గుంటూరు జిల్లా ఇప్పుడు కొత్త భయాన్ని తీసుకొస్తోంది. ఈ జిల్లాలో పెరుగుతున్న కేసుల్ని కంట్రోల్ చేయటానికి పక్కా ప్లాన్ అవసరమన్న మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్నూలు.. గుంటూరు జిల్లాల పుణ్యమా అని ఏపీ ప్రజలకు భయాందోళనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.  గుంటూరు జిల్లాలో మర్కజ్ కేసులు తక్కువగా ఉంటే.. అందుకు భిన్నంగా కర్నూలు లో ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో నమోదైన 93 కేసుల్లో ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో తొమ్మిది మందికే కరోనా వ్యాప్తి చెందగా.. కర్నూలు జిల్లాలో నమోదైన 84 కేసుల్లో 72 కేసులు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి కారణంగా నమోదు కావటం గమనార్హం.

ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. గుంటూరు జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల్లో ప్రైమరీ కాంటాక్ట్  53 కాగా.. సెకండరీ కాంటాక్ట్ కేసులు 31 కావటం విశేషం. దీనికి భిన్నంగా కర్నూలు జిల్లాలో ప్రైమరీ కాంటాక్ట్ 11 కేసులైతే.. సెండరీ కాంటాక్ట్ కేసులు ఏమీ లేకపోవటం కాస్త ఊరట కలిగించే అంశం. ఈ రెండు జిల్లాల్లోని ప్రజలు భౌతిక దూరాన్ని పాటించే విషయం లో ప్రదర్శించిన నిర్లక్ష్యం కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏపీలో జిల్లాల వారీగా పాజిటివ్ కేసులు చూస్తే..
% గుంటూరు     93
% కర్నూలు      84
% నెల్లూరు       56
% ప్రకాశం          41
% క్రిష్ణ              36
% కడప            31
% చిత్తూరు        23
% ప.గో.           23
% విశాఖ          20
% తూ.గో.        17
% అనంతపురం  15
Tags:    

Similar News