కూరగాయల సంచుల్లో నోట్ల కట్టలు...కోడి పందెల్లో మన నేతలు!
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు సందడి చేశాయి.
ఏపీలో ఈ ఏడాది కోడి పందేలు పెద్ద ఎత్తున నిర్వహించినట్లు చెబుతున్నారు. చాలా కాలం తర్వాత కోస్తాంధ్ర జిల్లాల్లోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందేలు పెద్ద ఎత్తున నిర్వహించారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు తుంగలోకి తొక్కడ హాట్ టాపిక్ గా మారింది.
హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, డిప్యూటీ స్పీకర్ మొదలైన నేతలు స్వయంగా ఈ కోడి పందేల కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం! ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో నేతలు కోడి పందేల కార్యక్రమంలో హల్ చల్ చేసినట్లు చెబుతున్నారు. వీరిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
అవును... ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు సందడి చేశాయి. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా పెద్ద ఎత్తున జరిగినట్లు చెబుతున్నారు. ఈ పందేల్లో వందల కోట్లు చేతులు మారాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు రూ.700 కోట్లు పైనే చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు.
ప్రధానంగా పెద అమిరం, సీసలి, మహదేవపట్నం, డేగాపురం, కామవరపుకోట, దెందులూరు, కలిదిండి తదితర ప్రాంతాల్లో భారీ బరులు ఏర్పాటు చేయగా.. ఇక్కడ డబ్బు ప్రవాహం పీక్స్ అని అంటున్నారు. ఈ కోడి పందేలకు తోడు గుండాట, పేకాట మొదలైన జూద క్రీడలు నిర్వహించడం గమనార్హం.
ఇక ఈస్ట్ విషయానికి వచ్చేసరికి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీగా బరులు ఏర్పాటు చేశారు. మురమళ్ల, కడియం, గోపాలపురం, గురజానపల్లి, కరప, పిఠాపురం, మండపేట, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, గోకవరం, ఆత్రేయపురం, సఖినేటిపల్లి తదితర ప్రాంతాల్లో ఈ జూదాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.
ఈ సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందేలు, గుండాట, ఇతర జూద క్రీడలతోపాటు మద్యం వ్యాపారం అన్నీ కలిపి పండుగ మూడు రోజుల్లో దాదాపు రూ.1,500 కోట్ల లావాదేవీలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా కూరగాయల సంచుల్లో నోట్ల కట్టలు తీసుకుని పలువురు పందేలకు రావడం గమనార్హం.
కోడి పందేలను తిలకించిన నేతలు!:
ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదామిరంలో జరిగిన కోడి పందేలను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎంపీ పుట్టా మహేష్, పలువురు ఎమ్మెల్యేలు వీక్షించగా... బాపట్లలో జరిగిన కోడి పందేలను మంత్రి సత్యప్రసాద్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తిలకించారు.
అదే విధంగా... డేగాపురంలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, తణుకులో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాసరావు, సీసలిలో ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు.. దెంద్లూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదే క్రమంలో.. కైకలూరులో నిర్వహించిన కోడి పందేలను మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ మహేష్ యాదవ్, ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ తిలకించారు. కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు.. అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ లు దగ్గరుండి పర్యవేక్షించారు!